Sunday, 13 January 2013

సంక్రాంతి శుభాకాంక్షలు

                                                                          
బ్లాగు మిత్రులందరికీ  సంక్రాంతి శుభాకాంక్షలు.  పల్లె ఆకు పచ్చని చీర కట్టుకుని పరవశించే పండగ వేళ సొంతూర్లో ఉంటె ఆ ఆనందమే వేరు. మాది  గుంటూరు జిల్లా వేమూరు. కోనసీమ  పల్లె అందాలను  పుణికి పుచ్చుకున్నట్టు ఎటు చూసినా పచ్చదనంతో, కొబ్బరిచెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది మా వూరు. గతేడాది వెళ్ళలేకపోయినా ఈసారి సంక్రాంతికి వూళ్ళో ఉండాలని గట్టిగా తీర్మానించుకుని వచ్చేశాను. వీలు చిక్కినప్పుడల్లా వూరుకు చెక్కేయడం చెప్పలేని ఆనందం. ఎవరికైనా సొంతూరి గాలి, నీరు, నేల... అసలక్కడి గాలి ఒక్కసారి పీల్చితే చాలు కొన్నాళ్ళకు సరిపడా శక్తిని సమకూర్చుకోవచ్చు. ఇలా చెబుతుంటే గుర్తొచ్చింది... మిత్రుడు గజల్ శ్రీనివాస్ సంక్రాంతి రోజు ఉదయం 9.30 గంటలకు ఈటీవీ-2 లో ఓ  మంచి పాట పాడారు. ఒక్కసారి పల్లెకు వెళ్లి రావాలని చెబుతూ ఆలపించిన ఈ గీతం మిమ్మల్ని మీ వూరు తీసుకువెళుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఎంచక్కా పండగ సంబరాలను ఆస్వాదించాలని కోరుకుంటూ మరోసారి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 

Monday, 31 December 2012

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                                                 
ముందుగా మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  నిరుటి ప్రమాణాలను ఎంత వరకు పాటించామో., ఆ లక్ష్యాలను ఎంత వరకు అధిగామించామో నేడు ఒక్కసారి తరచి చూసుకోవాలి. ఆ లోటుపాట్లను సమీక్షించుకుని కొత్త గమ్యాన్ని నిర్దేశించుకుందాం. జ్ఞాపకాలను తడిమి చూసుకుంటూనే వాస్తవంలో నెరవేర్చాల్సిన కర్తవ్యానికి వెన్నంటే ఉందాం. ఒక ఆశావహ భవిష్యత్తు దిశగా జీవితాన్ని నడిపించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనకు అనంతమైన శక్తి యుక్తులు ఇవ్వాలని  ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటూ అందరికీ మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

Friday, 28 December 2012

రైతు ప్రగతి పట్టని 2012

వ్యవసాయకంగా పుట్టెడు దిగులును మిగిల్చిన 2012 లో రైతుల స్థితిగతులు ఏమీ మెరుగు పడలేదు. అన్నదాతల్ని పీల్చి పిప్పి చేసీ ఏ అవకాశాన్నీ పాలకులు వదల్లేదు. వరుస విపత్తులు  రైతుల్ని వెంటాడితే., అసంబద్ద విధానాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరిచే చర్యలకు ఉపక్రమించాయి.  పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. రైతులు విపణిలో పంటల్ని అమ్మేసుకున్నాక ధరలకు రెక్కలోచ్చాయి. ఎగుమతుల నిర్ణయాలు రైతులకు ప్రతికూలమయ్యాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ ల బిల్లును కేంద్రం అనైతికంగా ఆమోదింపచేసుకుని నైతికంగా ఓడిపాయిందన్న అపఖ్యాతిని కేంద్రం మూటగట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రైతులకు వాటిల్లిన కాస్త నష్టాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                          

Wednesday, 26 December 2012

తెలుగు వారి పండగ

                                                               
అజంత భాషయిన తెలుగు మాధుర్యాన్ని దేశ దేశాల్లోని తెలుగు వారందరికీ చేరువ చేయడం లక్ష్యంగా నేడు ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలు 226 విభిన్న కార్యక్రమాలతో తల్లిభాషకు శోభను చేకూర్చబోతున్నాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటం, వికాసానికి కృషి చేయడం, శాస్రీయ జానపద కళారూపాలను ప్రోత్సహించడం, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, మాదలిక పదకోశాల రూపకల్పన తదితర 9 ప్రధాన ఆశయాలతో ఈ సభలు జరగనుండటం విశేషం.
                                                                  
అయితే.., పరాయి భాషా వ్యామోహంలో అమ్మ భాష అంతరించిపోయే దుస్థితిని కొని తెచ్చుకొంటున్నాం. సోదర తమిళులు, కన్నడిగులకు ఉన్న భాషాభిమానంలో మనకు ఒక వంతు కూడా లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. చట్టబద్దంగా తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను దాని పర్యవేక్షణ కిందకు తీసుకురావాలన్న భాషోద్యమకారుల కోరికను తీర్చే దిశగా మనం ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరముంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను ఆధునికీకరించడం నేడెంతో అవసరం. భోధనా భాష కాకుండా అమ్మభాష బతకజాలదని నేడందరూ గుర్తించి పాలకులతో సహా అందరూ గుర్తించి ఆచరించాల్సిన తరుణమిది.  తెలుగు భాష వికాసం లక్ష్యంగా ఇది మన తెలుగు వారందరి గురుత బాధ్యత. మన కర్తవ్యం కూడా..!

Wednesday, 19 December 2012

పత్తి రైతుకు మార్కెట్ కష్టాలు

నెట్ కు దూరంగా వ్యక్తిగత పని ఒత్తిడిలో ఉండి నిన్న ఈనాడులో ప్రచురితమైన నా వ్యాసం "మార్కెట్ వలలో విల విల - పత్తి రైతు దూదిపింజే " ను పోస్ట్ చేయలేకపోయాను. రాష్ట్రంలో పత్తి రైతుల మార్కెట్ కష్టాలపై రాసిన ఈ వ్యాసంలో కేంద్ర పత్తి సంస్థ (సిసిఐ) బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టడం జరిగింది. బ్లాగు మిత్రుల కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                              

Wednesday, 28 November 2012

మరో ఎన్నికల అస్త్రం-నగదు బదిలీ పధకం

                                                              
వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగదు బదిలీ పేరిట భారీ సంస్కరణకు యూపీయే సర్కారు సిద్దపడిందని నిన్న చిదంబరం ప్రకటనతో తేటతెల్లమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోని అవినీతికి అడ్డుకట్ట వేయడానికి, పక్కదారి పడుతున్న సరఫరా నిరోదానికే ఈ నగదు బదిలీ అని ఇప్పటికే కేంద్రం వివరణ ఇచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకే సబ్సిడీ దక్కలన్నది యూపీయే  సర్కారు యోచన! అయితే తిరకాసంతా పేదల లెక్కలోనే ఉంది. జాతీయ నమూనా అధ్యయన నివేదిక ప్రకారం మన దేశంలో పేదలు 27.5 శాతం. సురేష్ టెండూల్కర్ బృందం వెల్లడించిన పేదలు 37 శాతం. అర్ధాకలితో అలమటిస్తున్న వారి శాతం అంతకన్నా ఎక్కువేనని సక్సేనా, సేన్ గుప్తా కమిటీల నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల్లో ఇస్తున్న ఆహారధాన్యాల ధరలను పెంచాలని కేల్కర్ కమిటీ సిఫారసు చేసింది. నగదు బదిలీ పధకాన్నిప్రవేశపెట్టి చేతులు దులిపెసుకోవాలని హితవు పలికింది. ప్రపంచబ్యాంకు, ప్రణాలికా సంఘం అదే పాత పాడటంతో సర్కారు వచ్చే ఏడాది ఆరంభం నుంచి నగదు బదిలీని అమలు చేస్తామని ప్రకటించింది. ప్రజాపంపిణీ వ్యవస్థను చక్కదిద్దుకోలేని ప్రభుత్వం నగదు బదిలీకి తెగబడిందనే విమర్శలు లేకపోలేదు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయడం కోసం కొన్ని దేశాలు నగదు బదిలీని అమలు చేస్తుంటే., మన దేశంలో మాత్రం పేదల సంఖ్యను కుదించడం కోసం పధకాన్ని అమలు చేస్తుండటం విడ్డూరం.

Tuesday, 6 November 2012

ఒబామా జయకేతనం

                                                                                                 
శ్వేత సౌధంపై మరోసారి నల్ల సూరీడు మెరిశాడు. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ఒబామా గెలుపొందటం చరిత్రాత్మకం. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఒబామా మిట్ రొమ్ని పై విజయం సాధించడం అమెరికాలో యువతరం డెమోక్రాట్ల పక్షాన నిలిచారని తెలుస్తోంది. సమర్ధ నాయకత్వం, చురుకైన ఆలోచనలు..., ముఖ్యంగా కష్టకాలంలో ఒబామా చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు, తుపాన్ సహాయ చర్యలు, బిన్ లాడెన్ ను హతమార్చిన తీరు.... ఇవన్నీ ఒబామాకు కలిసి వచ్చిన అంశాలే. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బారక్ ఒబామాకు శుభాకాంక్షలు.