మార్చితో ముగిసిన పంట కాలంలో కరవు కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. కరవు రైతుల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ధరలతో పాటు కరవు సాయాన్ని సకాలంలో అందించి రైతులకు భరోసా ఇవ్వటంలో విఫలమయ్యాయి. రాష్ట్రంలో రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని
గాలికి వదిలేసిన సార్కారు తీరును తప్పు పడుతూ., మళ్ళీ ఖరీఫ్ సమీపిస్తున్న
తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రాసిన
నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసం... లింక్ చూడగలరు.
Sunday, 22 April 2012
Wednesday, 18 April 2012
పసుపు రైతుల దీనావస్థ!
ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 90 శాతం ఆక్రమించిన భారత్ లో ఆ పంట పండిస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. అర్ధం పర్ధం లేని ఎగుమతి దిగుమతి విధానాలతో కేంద్రం రైతుల ప్రయోజనాలను
కాలరాస్తోంది. ఎగుమతుల నిషేధంతో దేశీయ రైతులు ధర లేక ఈ ఏడాది భారీ నష్టాలు
పొందాల్సి వచ్చింది. వీటికి తోడు వ్యాపారుల మోసాలతో ఉన్న ధర కూడా రైతులకు
అందటం లేదు. పత్తి ఎగుమతుల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని తర్వాత సవరించుకున్న కేంద్రం అదే తప్పును పసుపు విషయంలోనూ పునరావృతం చేసింది. కేంద్ర రాష్ట్రాలు లోపభూయిష్టమైన
విధానాలతో రైతుల ప్రయోజనాలు దెబ్బ తీస్తున్న తీరు వ్యవసాయ రంగాన్ని నాశనం
చేస్తోంది. ధరలు పతనమవుతున్న తరుణంలో కనీసం ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మంచి ధరలు అందేలా చూడాల్సిన పరిస్థితుల్లో సర్కారీ నిర్లక్ష్యం క్షమించరానిది.
Saturday, 31 March 2012
అన్నదాతకు విద్యుత్ చార్జీల షాక్!
అధికారికంగా ఇచ్చేది ఏడు గంటల కరెంటు. అమలులో రైతులకు అందుతున్నది నాలుగు గంటలు కూడా లేదు. ఇప్పటికే సక్రమంగా విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడుతున్న రైతులపై ప్రభుత్వం నేడు చార్జీల భారం మోపి వారిని మరింతగా కుంగదీసింది. పంటల సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్ కు 3 రూపాయల 20 పైసలు వసూలు చేస్తామనడం రైతులకు నిజంగా పెద్ద షాక్! 2014 దాకా కరెంటు చార్జీలు పెంచబోమని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ సర్కారు నేడు దాన్ని విస్మరించిన తీరు శోచనీయం. తాను బకాయి పడ్డం వల్లనే విద్యుత్ సంస్థల్ని సంక్షోభంలోకి నెత్తిన సర్కారు ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దటం ఘోరం. ఎవరి గొడవలు వాళ్ళు చూసుకుంటున్న రాష్ట్రంలో అసలు ప్రజా సంక్షేమం విస్మరిస్తుండటం అసలైన విషాదం.
Thursday, 29 March 2012
సైన్యంలో తెగే తల ఎవరిది?
సైన్యంలో మందుగుండు కొరత తీవ్రంగా ఉందని., వైమానిక రక్షణ వ్యవస్థకు కాలం చెల్లి పోయిందని, కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదంటూ ప్రధాని మన్మోహన్ కు ఆర్మీ జనరల్ వీకే సింగ్ రాసిన లేఖ దేశం పరువును బజారుకు ఈడ్చినట్లయ్యింది. పదవీ విరమణ విషయంలో మాట నెగ్గించుకోలేకపోయిన సింగ్, చివరికి రక్షణ వ్యవస్థను వీధిన పడేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నేట్టారనే చెప్పాలి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో జనరల్ సింగ్ తలకాయ తెగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశ భద్రతకు కీలకమైన రక్షణ వ్యవస్థ నేడు వివాదాలకు కేంద్ర బిందువవడం మనం చేసుకున్న దురదృష్టం.
Thursday, 22 March 2012
ఉగాది శుభాకాంక్షలు
బ్లాగు మిత్రులందరికీ మన తెలుగు సంవత్సరం " శ్రీ నందన నామ" ఉగాది శుభాకాంక్షలు. శిశిరంలో ఎండిన చెట్లన్నీ కొత్త చిగుళ్ళు తొడుక్కుని ఈ వసంతాగమన వేళ ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేయడం సౌందర్యారాధకులకు కన్నుల పండుగే. కొత్త పంటలు చేతికందే ఈ సమయంలో నైవేద్యంగా పెట్టే షడ్రుచుల వేప పచ్చడి అనుభూతే వేరు. షడ్రుచులూ సమపాళ్ళలో కలగలిసిన వేప పచ్చడిని తీసుకోవడం ద్వారా ఈ వత్సర కాలంలో ఏదీ ఎక్కువా తక్కువా కాకుండా మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టసుఖాలకు ఉగాది పచ్చడి ప్రతీకగా నిలుస్తుంది. వసంత ఋతువు ఆగమన వేళ వసంత నవరాత్రులు కూడా ప్రారంభమౌతాయి. తెలుగు పండుగలలో తోలి పండుగగా నిలిచే ఉగాది సకల జీవరాసులకు మనస్సులను రంజింప చేస్తూ., ప్రకృతిని సైతం మనోహరంగా తీర్చిదిద్దగలుగుతుంది. నిన్నటి పాత వాసనల్ని వదిలి సరికొత్త ఆశలతో నందన ఉగాదిని స్వాగతిద్దాం. మరోసారి మీ అందరికీ నందన నామ ఉగాది శుభాకాంక్షలు.
రైతు క్లబ్బులకు "నాబార్డు" చేయూత
రాష్ట్రంలో కొత్తగా మరో 600 రైతు క్లబ్బులకు చేయూత ఇవ్వాలని నిర్ణయించినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు "నాబార్డు" నేడు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి ఆఖరికి దేశం మొత్తంలో 91675 క్లబ్బులు ఉండగా., వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లోనే 6594 క్లబ్బులు (7 . 2 శాతం ) ఉన్నాయి. రైతు క్లబ్బుల ఏర్పాటుకు, మూడేళ్ళ పాటు నిర్వహణ ఖర్చులు, నిపుణులతో రైతులకు సలహాలు ఇప్పించడానికి., కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , ఆదర్శ రైతుల పొలాలను పరిశీలించడం వంటి ప్రయోజనకరమైన పనులకు నాబార్డు ఆర్ధిక సహకారం అందిస్తూ ఉంటుంది.
సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి, రుణాలు, మార్కెట్ పట్ల అవగాహన పెంచడం, వ్యవసాయదారుల సామర్ధ్యం పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల సత్వర అభివృద్ధికి కృషి చేయడమే ఈ రైతు క్లబ్బుల ప్రదాన ఉద్దేశం. అందరూ కలసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రైతు క్లబ్బులు ఉత్తమ వేదికలుగా పని చేస్తున్నాయి. అయితే వీటి పనితీరును మెరుగు పరచడం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులకు మరింతగా ఉపకరించేలా తీర్చిదిద్దటం నేడెంతో అవసరమని నా భావన.
Tuesday, 20 March 2012
ఓటి బతుకులు
మొక్క మొలిచిననాడే...
మళ్ళీ కధ మొదలయ్యింది..
పైరు విత్తుతున్న ప్రతిసారీ...
రైతు గుండెలో విచ్చుకత్తులు దిగుతున్నాయి...
మొక్క ఎదుగుతున్న కొద్దీ..
రైతు బతుకు గొడ్డుమోతుదవుతోంది...
కాయకష్టం కొండేక్కుతుంటే..
ఊతమిచ్చినవాడే ఊరేగుతున్నాడు..
కర్రు కదిలించినవాడు..
కర్పూరంలా కరుగుతున్నాడు...!
పాదు ఫలమిచ్చినా ఊతకర్రదే పెత్తనమంతా...
ఏళ్ళు గడుస్తున్నా ఓటి బతుకే రైతులదంతా..!!
ప్రతి తిండి గింజ పై తినేవారి పేరు రాసుంటే...
రైతు నాలుకలపై ఆ బీజాక్షరాలు ఎందుకు లేవు?
కాలం కరుగుతున్నప్పుడల్లా...
కొత్త అప్పులు పెరుగుతున్నాయి....
పంట పండుతున్న ప్రతిసారీ...
రైతు డొక్కలు ఎండుతున్నాయి...!
జీవనసారాన్ని ఔపోసన పట్టిన రైతుకు...
మార్కెట్ మాయలు అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే..!
పదే పదే పడి లేస్తున్న ప్రయాసలో...
పాపం..
రైతు బతుకంతా ఓ జూదమే!!
Subscribe to:
Posts (Atom)







