Sunday 9 November 2014

చౌ మహల్లా అందాలు.... సుల్తాన్ల సంపదలు

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఉంటున్నా ఇంకా నగరంలో కొన్ని విశేషాలను నేనిప్పటికీ చూడలేదనే వెలితి అప్పుడప్పుడు నన్ను బాధిస్తూ ఉంటుంది. వృత్తిపరమైన వత్తిళ్ళు, ఇతరత్రా పనులతో తీరిక లేకుండా ఉండటంతో అది సాధ్యపడలేదని నా మనసు సమర్ధించుకోవచ్చు. ఇటీవల నా సహచరుడు నాగరాజ్ చౌ మహల్లా ప్యాలెస్ కు వెళ్లివచ్చి నా పనిని మరింత తేలిక చేసాడని చెప్పాలి. ఎట్టకేలకు ఈ ఆదివారం చౌ మహల్లా ప్యాలెస్ దర్శన భాగ్యం కలిగింది. ప్యాలెస్ గురించి తెలుసుకునే ముందు కొంచెం క్లుప్తంగా గోల్కొండ సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే చాలా విషయాలు అవగతమవుతాయి.
ప్రాణభయంతో 1467 తర్వాత సొంత దేశం టర్కీ నుంచి పారిపోయి దక్కన్ ప్రాంతానికి చేరిన సుల్తాన్ కులీ అనంతర కాలంలో కుతుబ్ షాహీల సామ్రాజ్యాన్ని గోల్కొండలో పాదుకొల్పాడు. ఈ వంశీకుల పతనపు రోజుల్లో అంటే .,
1687లో అబ్ధుల్లాఖాన్ అనే దేశద్రోహి కోట రహస్యం చెప్పడంతో గోల్కొండ కోట మొఘలాయిల వశమై కుతుబ్ షాహీల పాలన ముగిసింది. మొఘల్ చక్రవర్తుల సుబేదార్లుగా ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ రాజ్యంలో అసఫ్ జాహీల పాలన (నిజాం)మొదలైంది. 1707లో ఔరంగజేబు మరణానంతరం దేశంలోకి ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు వాళ్లు చొచ్చుకురావటం ఆరంభించారు. తర్వాత నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్ కు మార్చి అసఫ్ జా బిరుదుతో దక్కన్ పాలకుడయ్యాడు. ఇతని తర్వాత రెండో కొడుకైన నాసిర్ జంగ్ కు అతని మేనల్లుడు ముజాఫర్ జంగ్ కు మధ్య వారసత్వ విభేదాలు పొడసూపాయి. 1750 లో నాసిర్ హత్య తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే సహకారంతో ముజఫర్ సుబేదారు అయ్యాడు. 1751 లో ముజఫర్ మరణానంతరం నాసిర్ రెండో తమ్ముడైన నిజాం అలీఖాన్ కు అధికారం దక్కకుండా మొదటి తమ్ముడైన సలాబత్ జంగ్ ను ఫ్రెంచ్ సేనాని బుస్సీ సుబెదారుని చేశాడు. ఇక ప్యాలెస్ విషయానికి వస్తే....,
1750లో సలాబత్ జంగ్ నిజాం అయ్యాక తన రాజప్రసాదంగా చౌ మహల్లాని కట్టించాడని చరిత్ర చెబుతోంది. ఈ  మహల్ టెహ్రాన్ లోని పర్షియా రాజ ప్రసాదాన్ని పోలి ఉంటుంది. ప్యాలెస్ లో నిజాం నవాబులు  జర్మని, ఫిన్లాండ్, టర్కీ, చైనా తదితర దేశాల నుంచి తెప్పించి ఉపయోగించిన పింగాణి సామగ్రి ని ప్రదర్శనకు ఉంచారు. అలాగే వారి కాలంలో వాడిన దుస్తులు, అరుదైన కళాత్మక వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక కత్తులు, కటార్లు, సైనిక సామాగ్రికి అంతేలేదు. వారు వాడిన ఖరీదైన రోల్స్ రాయిస్ కారు, ఇతర వింటేజ్ కార్లు, బగ్గీలు  రాజముద్రలు ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా మహల్ లోని భవనాల పై కప్పునకు ఉపయోగించిన డిజైన్లు చూడముచ్చటగా ఉన్నాయి. నేడు మనకు ప్రియమైన వారికి వారి ఫొటోలతో కూడిన పెద్ద పెద్ద టీ కప్పులను బహుకరిస్తుంటాం. ఇటువంటి వారి ఫొటోలతో కూడిన టీ కప్పులను 5 శతాబ్దాల క్రితమే నవాబులు జర్మని నుంచి తెప్పించారు. అసఫ్ జాహీలు ఎలా పరిపాలించారనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే., సంపదలతో వారెలా తులతూగారో హైదరాబాద్ లో వాళ్ళు నిర్మించిన చౌ మహల్లా, చార్మినార్, రోషన్ మహల్, గుల్షన్ మహల్, షాదీఖాన, దర్గా హుస్సేన్ షావలి, కింగ్ కోటి రాజ ప్రసాదం తదితర భవనాలను చూస్తేనే తెలుస్తుంది. 
ముఖ్యంగా చౌ మహల్లా ప్యాలెస్ భవంతులు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక్కో భవనం నిర్మించిన నాటి ఇంజనీర్ల నైపుణ్యం, కళాకారుల పనితనం ఎంతో ముచ్చటేస్తుంది. ఫౌంటెన్లు , గార్డెన్లను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఆర్చీలు, డోమ్, స్తంభాలు కుతుబ్ షాహీల నిర్మాణ ప్రత్యేకతలు. నల్లరాతితో పైన అలంకరణలు, ఎనామిల్ పనితనం మొదలైన వాటిని టర్కిష్ శిల్పకళ నుంచి తీసుకుని భారతదేశ శిల్పకళతో సమ్మిళితం చేసి రూపొందించిన శిల్ప కళ వీరిది. వీరి వాస్తు శిల్పకళ అరేబియన్, ఇరానియన్, టర్కిష్, భారతీయ కళల సమ్మేళనంగా చెప్పవచ్చు.  ఇరాన్ తదితర దేశాల నుంచి తెప్పించిన షాండ్లియర్లు ప్రత్యేక ఆకర్షణ. తన నగరం నీటిలో చేపల్లాగా ప్రజలతో నిండి కళకళలాడాలని మహమ్మద్ కులీ కోరుకున్నట్టు  '' మేరా షహర్ లోగోం సే మామూర్ కర్ రఖియాజా  తూ దరియామె మీర్, యా సమీ " ఆధునిక హైదరాబాద్ నేడు వెలుగొందుతోంది.
                    (మిత్రులు వేదగిరి రాంబాబు రచించిన "నాలుగు శతాబ్దాల నగరం" పుస్తకం నుంచి...)
                                                                                         












1 comment:

కమనీయం said...

I have visited this beautiful palace sometime back.Thanks for introducing it to the bloggers ,along with pictures.