Monday 31 December 2012

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                                                 
ముందుగా మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  నిరుటి ప్రమాణాలను ఎంత వరకు పాటించామో., ఆ లక్ష్యాలను ఎంత వరకు అధిగామించామో నేడు ఒక్కసారి తరచి చూసుకోవాలి. ఆ లోటుపాట్లను సమీక్షించుకుని కొత్త గమ్యాన్ని నిర్దేశించుకుందాం. జ్ఞాపకాలను తడిమి చూసుకుంటూనే వాస్తవంలో నెరవేర్చాల్సిన కర్తవ్యానికి వెన్నంటే ఉందాం. ఒక ఆశావహ భవిష్యత్తు దిశగా జీవితాన్ని నడిపించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనకు అనంతమైన శక్తి యుక్తులు ఇవ్వాలని  ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటూ అందరికీ మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

Friday 28 December 2012

రైతు ప్రగతి పట్టని 2012

వ్యవసాయకంగా పుట్టెడు దిగులును మిగిల్చిన 2012 లో రైతుల స్థితిగతులు ఏమీ మెరుగు పడలేదు. అన్నదాతల్ని పీల్చి పిప్పి చేసీ ఏ అవకాశాన్నీ పాలకులు వదల్లేదు. వరుస విపత్తులు  రైతుల్ని వెంటాడితే., అసంబద్ద విధానాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరిచే చర్యలకు ఉపక్రమించాయి.  పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. రైతులు విపణిలో పంటల్ని అమ్మేసుకున్నాక ధరలకు రెక్కలోచ్చాయి. ఎగుమతుల నిర్ణయాలు రైతులకు ప్రతికూలమయ్యాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ ల బిల్లును కేంద్రం అనైతికంగా ఆమోదింపచేసుకుని నైతికంగా ఓడిపాయిందన్న అపఖ్యాతిని కేంద్రం మూటగట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రైతులకు వాటిల్లిన కాస్త నష్టాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                          

Wednesday 26 December 2012

తెలుగు వారి పండగ

                                                               
అజంత భాషయిన తెలుగు మాధుర్యాన్ని దేశ దేశాల్లోని తెలుగు వారందరికీ చేరువ చేయడం లక్ష్యంగా నేడు ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలు 226 విభిన్న కార్యక్రమాలతో తల్లిభాషకు శోభను చేకూర్చబోతున్నాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటం, వికాసానికి కృషి చేయడం, శాస్రీయ జానపద కళారూపాలను ప్రోత్సహించడం, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, మాదలిక పదకోశాల రూపకల్పన తదితర 9 ప్రధాన ఆశయాలతో ఈ సభలు జరగనుండటం విశేషం.
                                                                  
అయితే.., పరాయి భాషా వ్యామోహంలో అమ్మ భాష అంతరించిపోయే దుస్థితిని కొని తెచ్చుకొంటున్నాం. సోదర తమిళులు, కన్నడిగులకు ఉన్న భాషాభిమానంలో మనకు ఒక వంతు కూడా లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. చట్టబద్దంగా తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను దాని పర్యవేక్షణ కిందకు తీసుకురావాలన్న భాషోద్యమకారుల కోరికను తీర్చే దిశగా మనం ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరముంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను ఆధునికీకరించడం నేడెంతో అవసరం. భోధనా భాష కాకుండా అమ్మభాష బతకజాలదని నేడందరూ గుర్తించి పాలకులతో సహా అందరూ గుర్తించి ఆచరించాల్సిన తరుణమిది.  తెలుగు భాష వికాసం లక్ష్యంగా ఇది మన తెలుగు వారందరి గురుత బాధ్యత. మన కర్తవ్యం కూడా..!

Wednesday 19 December 2012

పత్తి రైతుకు మార్కెట్ కష్టాలు

నెట్ కు దూరంగా వ్యక్తిగత పని ఒత్తిడిలో ఉండి నిన్న ఈనాడులో ప్రచురితమైన నా వ్యాసం "మార్కెట్ వలలో విల విల - పత్తి రైతు దూదిపింజే " ను పోస్ట్ చేయలేకపోయాను. రాష్ట్రంలో పత్తి రైతుల మార్కెట్ కష్టాలపై రాసిన ఈ వ్యాసంలో కేంద్ర పత్తి సంస్థ (సిసిఐ) బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టడం జరిగింది. బ్లాగు మిత్రుల కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                              

Wednesday 28 November 2012

మరో ఎన్నికల అస్త్రం-నగదు బదిలీ పధకం

                                                              
వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగదు బదిలీ పేరిట భారీ సంస్కరణకు యూపీయే సర్కారు సిద్దపడిందని నిన్న చిదంబరం ప్రకటనతో తేటతెల్లమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోని అవినీతికి అడ్డుకట్ట వేయడానికి, పక్కదారి పడుతున్న సరఫరా నిరోదానికే ఈ నగదు బదిలీ అని ఇప్పటికే కేంద్రం వివరణ ఇచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకే సబ్సిడీ దక్కలన్నది యూపీయే  సర్కారు యోచన! అయితే తిరకాసంతా పేదల లెక్కలోనే ఉంది. జాతీయ నమూనా అధ్యయన నివేదిక ప్రకారం మన దేశంలో పేదలు 27.5 శాతం. సురేష్ టెండూల్కర్ బృందం వెల్లడించిన పేదలు 37 శాతం. అర్ధాకలితో అలమటిస్తున్న వారి శాతం అంతకన్నా ఎక్కువేనని సక్సేనా, సేన్ గుప్తా కమిటీల నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల్లో ఇస్తున్న ఆహారధాన్యాల ధరలను పెంచాలని కేల్కర్ కమిటీ సిఫారసు చేసింది. నగదు బదిలీ పధకాన్నిప్రవేశపెట్టి చేతులు దులిపెసుకోవాలని హితవు పలికింది. ప్రపంచబ్యాంకు, ప్రణాలికా సంఘం అదే పాత పాడటంతో సర్కారు వచ్చే ఏడాది ఆరంభం నుంచి నగదు బదిలీని అమలు చేస్తామని ప్రకటించింది. ప్రజాపంపిణీ వ్యవస్థను చక్కదిద్దుకోలేని ప్రభుత్వం నగదు బదిలీకి తెగబడిందనే విమర్శలు లేకపోలేదు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయడం కోసం కొన్ని దేశాలు నగదు బదిలీని అమలు చేస్తుంటే., మన దేశంలో మాత్రం పేదల సంఖ్యను కుదించడం కోసం పధకాన్ని అమలు చేస్తుండటం విడ్డూరం.

Tuesday 6 November 2012

ఒబామా జయకేతనం

                                                                                                 
శ్వేత సౌధంపై మరోసారి నల్ల సూరీడు మెరిశాడు. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ఒబామా గెలుపొందటం చరిత్రాత్మకం. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఒబామా మిట్ రొమ్ని పై విజయం సాధించడం అమెరికాలో యువతరం డెమోక్రాట్ల పక్షాన నిలిచారని తెలుస్తోంది. సమర్ధ నాయకత్వం, చురుకైన ఆలోచనలు..., ముఖ్యంగా కష్టకాలంలో ఒబామా చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు, తుపాన్ సహాయ చర్యలు, బిన్ లాడెన్ ను హతమార్చిన తీరు.... ఇవన్నీ ఒబామాకు కలిసి వచ్చిన అంశాలే. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బారక్ ఒబామాకు శుభాకాంక్షలు.

Wednesday 31 October 2012

కరెంటు కష్టాలు ఇంకెన్నాళ్ళు!


                                                             
కరెంటు కోతలతో పరిశ్రమలే కాదు రాష్ట్రంలోని సకల జీవన రంగాలు కకావికలమౌతున్నాయి.  రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల ఉచిత విద్యుత్ మిధ్యగానే మిగిలింది. ఎన్నో ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ రెండు మూడు గంటలకే పరిమితం కావడంతో పంటలు జీవం కోల్పోయాయి. వేళాపాళా  లేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 60 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడుతున్నాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎడురవనుందని ముందే తెలిసినా ముదస్తూ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, ట్రాన్స్ కో విఫలమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
                                                                                                                                                                  ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 900 మెగావాట్లే. నిండని జలాశయాలతో విద్యుత్ ఉత్పత్తి అతి స్వల్పంగా ఉంది. కీలకమైన బొగ్గు ఆధారిత విద్యుత్  109 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. సంప్రదాయేతర రంగంలో విద్యుత్ ఉత్పత్తి 903 మెగావాట్లకు మించడం లేదు. నెలకు 1500 కోట్లు అదనంగా ఖర్చు చేయగలిగితే కరెంటు పుష్కలంగా సరఫరా చేయవచ్చని నిపుణుల సూచనను పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతిరోజూ 65 మిలియన్ యూనిట్ల లోటు తేలుతోంది. దీన్ని భర్తీ చేయలేక ట్రాన్స్ కో, డిస్కం లు భారీ విధ్యుత్ కోతలకు  తెగబడుతున్నాయి. కోతల ఫలితంగా గత ఆరేడు నెలల్లో 20 వేల కోట్లకు పైగా వర్క్ ఆర్డర్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చిన్న పరిశ్రమలు  లబోదిబోమంటున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న చీకట్లను తొలగించేందుకు  ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతాలు నొక్కి చెబుతున్నాయి. ప్రజలు కూడా విద్యుత్ పొదుపును అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Tuesday 16 October 2012

సేద్యాన్ని నాశనం చేస్తున్న విధానాలు!

భూసారం క్షీణించకుండా పది కాలా పాటు వ్యవసాయం నిలదొక్కుకోవాలంటే ఆచరించదగిన యాజమాన్య పద్దతులను సుస్థిర వ్యవసాయ విధానంగా వ్యవహరిస్తారు. ఈ విధానం కింద మన సహజవనరుల్ని సంరక్షిన్చుకోవడంతో పాటు సంప్రదాయ సాదు పద్దతులు, విత్తనా రకాలాను పరిరక్షించుకోవడం ద్వారా జన్యు వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. జన్యు, జీవ వైవిధ్యాన్ని కాపాడటమంటే మన వ్యవసాయాన్ని కాపాడుకోవటమే. నెలలో ఉండే సూక్ష్మజీవుల నుంచి భూమిపై బతుకుతూ పంటకు మేలు చేసే కీటకాల వరకు రైతునేస్తాలుగా పేరొందిన అన్ని రకాల జీవులనూ నాశనం చేసే రసాయన సేద్యంతో మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకొంటున్నాం. సేద్యాన్ని పరాదీనం చేస్తున్నాం.జీవ, జన్యు వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాం. ఈ అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. అప్ లోడ్ చేసిన వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ లింక్ చేస్తున్నాను.
                                                                

Monday 10 September 2012

భారత్ లో మందగించిన వరి పరిశోధనలు

                                                        
మన దేశంలో హైబ్రిడ్ వరి వంగడాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను సోమవారం హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ వరి సదస్సు నొక్కి చెప్పింది. దశాబ్దాలు గడుస్తున్నా మన పరిశోధనలు ముందుకు సాగటం లేదు. ఆహార భద్రత అంటూ గొంతు చించుకుంటున్న కేంద్ర సర్కారు... ఆ దిశగా పరిశోధనలకు పెద్ద పీట వేయడంలో ఘోరంగా విఫలమైంది. మన రాష్ట్రం విషయానికి వస్తే., రెండు దశాభ్దాల క్రితం రూపొందించిన చైతన్య, కృష్ణవేణి, ఐ.ఆర్ రకాలనే రైతులు నేటికీ వాడుతున్నారు. దిగుబడులు పెరగకపోవడం వల్ల రైతుకు నికరాదాయం తగ్గి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పరిశోధనలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్లనే ఈ దుస్థితి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా ఈ దిశగా దూసుకుపోతుంటే., మనం ఎక్కడో ఉన్నాం. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తోంటే., మన రైతులు సేద్యంలో నిలదొక్కుకునే పరిస్థితులు కూడా కల్పించలేకపోతున్నాం. "శ్రీ" వరి సాగు విధానంతో హెక్టారుకు 224 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డ్ సాధించిన రైతులు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రభుత్వాలు కనీసం ఇటువంటి విదానాలనైనా ప్రోత్సహిస్తే అన్నదాతకు మేలు జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు ఉంటేనే వ్యవసాయం  మనుగడ సాగిస్తుంది. 

Friday 31 August 2012

మట్టి వినాయకులకు జై కొడదాం!

                                                         
రాష్ట్రంలో ఏటా వినాయక చవితికి ఉపయోగిస్తున్న విగ్రహాలు 90 నుంచి 93 శాతం ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ తో రూపొందించినవే కావటం గమనార్హం. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని బాగా తగ్గించవచ్చు. గత రెండేళ్లుగా ఈ దిశగా చేపడుతున్న చర్యల వల్ల ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. నగర, పురపాలక సంస్థలు సైతం తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. కొందరు వ్యక్తులు, "సేవ్" వంటి కొన్ని స్వచ్చంద సంస్థలు ఈ దిశగా మట్టి విగ్రహాలను తయారు చేసి చిన్నవి ఉచితంగా, పెద్దవి కొద్దిపాటి ధరలకు అందిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీ పడకుండా రసాయనాలతో కూడిన రంగులు వాడిన రంగు రంగుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఈ ఏడాది మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం.  ఈ ఏడాది హైదరాబాద్ లో దాదాపు 15 వేల మట్టి విగ్రహాలను సరఫరా చేయించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  ఈ దిశగా 100 స్కూళ్లలో చైతన్యం తీసుకొచ్చి విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇంటింటా ఈ వినాయక చవితిని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేద్దాం...  మట్టి వినాయకులకు జై కొడదాం.

Thursday 23 August 2012

పనికిమాలిన కేంద్రమంత్రి

భారత దేశపు అత్యంత చెత్త వ్యవసాయ మంత్రి శరద్ పవార్ మరోసారి తన అసహనాన్ని వెళ్లగక్కారు. విత్తన                                                 
చట్టంలో తీసుకురావాల్సిన సవరణల గురించి మాట్లాడేందుకు అఖిల పక్షంతో డిల్లీకి వెళ్ళిన కన్నా బృందంపై రుసరుసలాడి తన అసహనాన్ని వెళ్లగక్కారు. మంత్రి కన్నా దీన్ని సరదాగానే తీసుకున్నా వారితో వెళ్ళిన రైతు నాయకులతో నేను మాట్లాడినప్పుడు.., పవార్ తమను ఎందుకొచ్చారు అన్నట్టు చూసారని., కనీసం అతిదులమన్న గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు. విత్తన చట్టంలో బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా ఉన్న పలు అంశాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమైనా., కార్పొరేటే సంస్థలకు బాకా వూదటంలో నేర్పరి అయిన పవార్, దేశీయ రైతుల ఇబ్బందుల గురించి పట్టించుకుంటాడని ఆశించడం అత్యాశే. విత్తన చట్టంలో ఇటువంటి సవరణలు చేస్తే కార్పొరేట్, ఎంఎన్ సీలు నష్టపోతాయని  పవార్ కి బాగా తెలుసు. వీళ్ళు లాభ పడేలా చేయాలనేదే ఆయన ఉద్దేశమని యావత్ దేశానికి తెలిసినా పాపం మన మౌన రుషి మన్మోహన్ సర్కారుకు తెలియదు. భారతీయ రైతుల్ని రక్షించాలంటే స్వతంత్ర భారత చెత్త వ్యవసాయ మంత్రి పవార్ ను క్రికెట్ కు పరిమితం చేయండి మహాప్రభో!   

Monday 20 August 2012

తెలుగు రైతుకు దక్కుతున్నదేమిటి?

దేశంలో నెలకొన్న కరవు పరిస్థితుల వల్ల ఆహారోత్పత్తి కుంటుపడి తద్వారా ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతకు మించి సేద్యంలో మరిన్ని నష్టాలకు రైతులు సిద్దపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరవు సాయం విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సొంత రాష్ట్రం పట్ల చూపుతున్న మమకారం, దక్షిణాది  రాష్ట్రాల విషయంలో చూపుతున్న సవతి ప్రేమ కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వానికి మునుముందు సమస్యలు తెచ్చిపెట్టనుంది. కరవు కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతుల విషయంలో ఏమీ మాట్లాడని మన ఎంపీలు., సంకీర్ణ ప్రభుత్వంలో కొందరు మిత్రపక్ష మంత్రులు వ్యవహరిస్తున్న తీరును గుడ్లప్పగించి చూస్తుండటం విచారకరం. ఏదేమైనా అంతిమంగా నష్టపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రైతుల పరిస్థితి., కరవు వల్ల, ఆహార భద్రతా సమస్య తదితర అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
                                                         


Monday 30 July 2012

కమ్ముకుంటున్న కరవు మేఘాలు!

                                                                
దేశంలో సాధారణం కంటే వర్షపాతం లోటు 21 శాతం ఉండటం కరవు పరిస్థితుల్ని సూచిస్తోంది. పది రోజుల క్రితం వరకు రాష్ట్రాన్ని వెంటాడిన కరవు ఛాయలు నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాభావం ఇలానే కొనసాగితే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు  తీవ్ర ఇబ్బందులు వచ్చి పడటం ఖాయం. ఇప్పటికే ఆలస్యంగా నాట్లు వేసుకుంటున్న రాష్ట్ర రైతులు ఈ రెండు నెలల్లో వర్షాలు కురవకపోతే పూర్తిగా నష్టపోవలసి  ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు ఇప్పటికే అమెరికాను కరవుతో కమ్మేశాయి. మన దేశంలో సైతం పెచ్చరిల్లిన కరవు కారణంగా ఆహారోత్పత్తి గణనీయంగా తగ్గే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ముందుకు సాగాల్సిన  అవసరముంది. కరవు వచ్చినప్పుడే  మేల్కొని ఏం చేయాలో ఆలోచించే కంటే., ఒక దీర్ఘకాల ప్రణాళికతో కరవును ఎదుర్కొనే వ్యూహాలను రచించి అమలు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. ఇప్పటికే చితికిన రైతులకు ఈ పరిణామం మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టేదే. వారి బాగుసేతకు సర్కారు పక్కా ప్రణాలికలు రచించాలి.  వర్షం వచ్చినప్పుడే గొడుగుల అవసరం గురించి యోచించే మన ప్రభుత్వాలు., యెంత సమర్ధంగా వ్యవహరించగలవన్నదే ప్రశ్న. 

Friday 20 July 2012

పదునేక్కని ఖరీఫ్ సాగు

నాట్లు పడాల్సిన సమయంలో నారుమడులు పోసుకోవాల్సిన దుస్థితి. నేలన్నరగా వెంటాడిన వర్షాభావంతో పంటలు సాగు చేయకుండానే తీవ్రంగా నష్టపోయిన రైతులు నేడు కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా ఆశావహ పరిస్థితులు ఏర్పడ్డాయని భావించడంలేదు. ఉరుముతున్న ఎల్ నినో పరిస్థితుల్లో వరి నాట్లు పడే సమయానికి తిరిగి వర్షాభావం తలెత్తితే రైతుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. ఈ పరిణామాలను విశ్లేషిస్తూ., ఇటువంటి సమయాల్లో సర్కారు చర్యలు ఎలా ఉండాలో సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                                

Sunday 24 June 2012

మొలకెత్తిన విపత్తు!

విత్తన సంక్షోభం రాష్ట్ర రైతుల్ని పట్టి పీడిస్తోంది. ప్రణాళికా లోపం వల్ల విత్తనాల కొరత సీజన్ ముంగిట్లో రైతులకు కలవరం కలిగిస్తోంది. ముఖ్యంగా పత్తి విత్తనాలు దొరక్క రైతులు అల్లాడుతుంటే, నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తడంతో అన్నదాతలు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి సేద్యం భారంగా మారిన రైతులకు సర్కారీ నిర్లక్ష్యం పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ పరిణామాలపై  నేను రాసిన "మొలకెత్తిన విపత్తు!" వ్యాసాన్ని ఈనాడు ఆదివారం ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                             

Thursday 7 June 2012

విత్తనంపై కార్పోరేట్ పెత్తనం

ఖరీఫ్ తొలినాళ్ళలోనే విత్తనాల కోసం రాష్ట్ర రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పత్తి రైతులు నకిలీ నాసిరకం విత్తనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేలైన కంపెనీల విత్తనాలు నల్ల బజారులో అధిక ధరలు పెట్టి కొనాల్సిరావడం రైతులకు భారంగా పరిణమించింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నమంటున్న  వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. పంటల సాగుకు ముఖ్యమైన ఉత్పాదకాలను కూడా మేలైనవి సరఫరా చేయలేక పోతున్న సర్కారీ నిర్వాకాన్ని ఎండగడుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు  "ఈనాడు" ప్రచురించింది. ఆ క్లిప్పింగును మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేసాను.
                                                             

Friday 18 May 2012

మేలుకొలుపు పాడాల్సిందేవరికి?

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిన పరిస్థితుల్లో కిరణ్ సర్కారు రైతు చైతన్య యాత్రలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో పంటల సాగు విధానాల పట్ల రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు  ఈ యాత్రలని అంటున్న సర్కారు సీజన్ ముంగిట రైతులపై మోయలేని భారం పడుతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోతోంది. పంటల సాగుకు  ఏం చేయాలో రైతుకు తెలిసిన పరిస్థితుల్లో వారికి కావలసింది ఆర్ధిక తోడ్పాటు మాత్రమె. వరుస నష్టాలతో ఇప్పటికే చితికిన రైతు బతుకులకు ఓదార్పు లభించాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు రైతుకు కల్పించాలి. దీనికి బిన్నంగా ఎరువులతో సహా అన్ని ఉత్పాదకాల ఖర్చులు లు పెరుగుతుంటే., ఉత్పత్తుల ధరలు పదే పదే పతనమై రైతుల్ని కలవరపెడుతున్నాయి. వీటిని సరిదిద్దాల్సిన పాలకుల్లో చైతన్యం లోపించినదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేసాను. 

Thursday 17 May 2012

రూపాయి క్షీణత - రైతులపై పెను భారం

                                                                
డాలరుతో బక్క చిక్కిన రూపాయి రైతుకు మరింత భారాన్ని పెంచింది. రాయితీ భారాన్ని మోసేందుకు కేంద్రం 
నిరాకరించడాన్ని సాకుగా చూపి  ఎరువుల కంపెనీలు ధరల్ని ఇష్టానుసారం పెంచేశాయి. గత నెలలో ఐపీఎల్ కంపెనీ పోటాష్ ధరల్నిభారీగా పెంచితే., నేడు కోరమాండల్ కంపెనీ పోటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచుతున్నట్టు వ్యవసాయశాఖకు తెలిపింది. మరి కొద్ది రోజుల్లో సీజన్ కు సన్నద్దమవుతున్న రైతుకు ఇది నిజంగా పిడుగుపాటే.  తాజాగా పెరిగిన ధరలతో రైతులపై రూ. 436 కోట్ల దాకా అదనపు భారం పడుతుంది. గత ఏడాది కాలంలో 17 సార్లు ఎరువుల ధరలు పెంచిన కంపెనీలను ప్రభుత్వం నియంత్రించ లేకపోవడంతో రైతుకు పెట్టుబడులు మరింత భారంగా పరిణమించాయి. ఇప్పటికే వరుస నష్టాలతో సేద్యాన్ని అప్పులమయం చేసుకున్న రైతుల పరిస్థితిని మరింత దిగజార్చేలా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఎరువుల ధరలపై నియంత్రణలను ఎత్తివేసాక  కంపెనీలు ఎడాపెడా ధరలు పెంచుతున్నా  కేంద్రం చోద్యం చూస్తోందే తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. రైతు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే కొద్దీ వ్యవసాయం దిగజారి., అంతిమంగా ఆర్ధిక వ్యవస్థనే దెబ్బ తీస్తుందని తెలిసిన "ప్రపంచ ప్రముఖ ఆర్ధికవేత్త" మన్మోహన్ ఎన్నేళ్ళు ఇలా మౌనవ్రతం పాటిస్తారో కానీ అన్నదాతల్లో మాత్రం సహనం నశిస్తోంది.

Tuesday 15 May 2012

రైతు హక్కులు కాపాడుదాం!

                                                             
ఏటా మే 15 వ తేదీని రైతుల హక్కుల దినోత్సవం గా పాటించాలని రైతు విత్తన హక్కుల పరిరక్షణ వేదిక, రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్తంగా పిలుపునిచ్చాయి. రైతులు, రైతు సంఘాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వం దీన్ని పాటించాలని అవి కోరాయి. రైతులు పూర్తిగా హక్కులు కోల్పోతున్న నేపధ్యంలో సేద్యంలో రైతులు తీసుకునే అన్ని నిర్నయాలకూ మూలమైన విత్తన హక్కులు కీలకమని భావించి రైతు విత్తన హక్కుల వేదికను  yఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు, డాక్టర్ కే.ఆర్. చౌదరి నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల సేద్య హక్కుల పరిరక్షణ., ముఖ్యంగా పంట, విత్తన రకాల ఎంపిక., కలిసి వచ్చే సంస్థలు, వర్గాలు, నిపుణుల మధ్య సమన్వయంతో హక్కుల పరిరక్షణకు కృషి చేయడం., ఇందుకు అవసరమైన ప్రచురణలు, చర్చలు నిర్వహించడం., లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం., రైతులు, సమాజం విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని వారంటున్నారు. వీరి కృషి ఫలించాలని కోరుకుందాం. గురువారం ఈనాడులో నన్ను కలిసిన ప్రసాదరావు గారికి  పూర్తి స్థాయిలో నా సహకారం అందిస్తానని  హామీ ఇచ్చాను. మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.

Friday 4 May 2012

పాడి రైతుకు కేంద్రం బాసట!

                                                                
భారత్ వ్యాప్తంగా పాడి పశువులకు బీమా పధకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2006లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పధకం నేడు దేశంలో 300 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి పది లక్షల పశువులకు  బీమా సదుపాయం కల్పించనున్నారు. బీమా ప్రీమియంలో సగం రైతులు భరించాల్సి ఉండగా., మిగిలింది ప్రభుత్వం భరిస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాల  అభివృద్దికి సంబంధించి ఏర్పాటైన పార్లమెంటరి స్థాయి సంఘం అధ్యయనం చేసిన నివేదిక నిన్న పార్లమెంటు ఉభయ సభలకు అందింది. నివేదికలోని అంశాల ప్రకారం దేశంలో పాడి పురోగతికి కేంద్రం ఇతోధికంగా సాయపడనుంది. దేశంలో పాల ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడానికి, నాణ్యమైన పశువుల పెంపకానికి కేంద్రం రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు అందించనుంది. అలానే పశువులకు కావలసిన వైద్య సదుపాయాలను మెరుగుపరచేందుకు గ్రామాల్లో వైద్యశాలలను ఏర్పాటుచేయనున్నారు. తరచుగా వైపరీత్యాల బారిన పడుతున్న రైతులకు  పాడి నిజంగా కలిసివచ్చేదే. ఈ పధకాల గురించి రైతుల్లో మంచి అవగాహన కల్పిస్తే అన్నదాతలు వీటి ప్రయోజనాలు పొందగలుగుతారని కేంద్రం గుర్తించాలి.

Tuesday 1 May 2012

చెక్కు చెల్లింపుల విధానం రైతుకు మేలు చేస్తుందా...?

                                                                  
దేశంలో జరుగుతున్న  బియ్యం సేకరణలు, ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను ఆధునికీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.  దీనిలో భాగంగా కొనుగోళ్ళ వివరాలను అత్యంత పారదర్శకంగా అన్ లైన్ లో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో జరిపే చెల్లింపులు అక్కౌంట్ పేయి చెక్కుల ద్వారా జరపాలని, రైతుల నుంచి జరిపే కొనుగోళ్ళ వివరాలను కంప్యుటరీకరించి ఆన్ లైన్ లో  అందుబాటులో ఉంచాలని కూడా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. వీటికి తోడూ ఇదే పద్దతిని మిల్లర్లు జరిపే లావాదేవీలకు కూడా  వర్తింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కోస్తా, రాయల సీమల్లో బ్రోకర్ల ద్వారా జరిపే క్రయ విక్రయాల విషయంలో ఈ చెక్కుల పెమెంట్లు జరపడం 
 సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పద్దతిద్వారా కేవలం చెక్కుల తో చెల్లింపులే కాకుండా రైతుల నుంచి మిల్లర్లు యెంత ధాన్యం కొన్నారు..? ఏ వెరైటీని ఏ ధరకు కొన్నారు వంటి వివరాలు ఆన్ లైన్ లో ఉంచాలనేది కేంద్ర ప్రణాళికలో భాగం. ఒక రకంగా రైతుకు మద్దతు ధరను అందించాలనే కేంద్ర ప్రయత్నంలో ఇదొక భాగంగా చెప్పవచ్చు. 
దీనివల్ల....
ధాన్యం సేకరణ తేలిక అవుతుంది. మెరుగైన మిల్లింగ్ మేనేజ్ మెంట్ సాధ్యపడుతుంది. అలానే కష్టం మిల్లింగ్ కోసం మిల్లుల నమోదు, మిల్లుల వారి జరుగుతున్నా ధాన్యం పంపిణీ సమాచారం క్షణాల్లో పొందటం ద్వారా సమయం ఆదా అవుతుంది. 
అయితే...,
ధాన్యం సేకరణ, ఎఫ్ సి ఐ డెలివరి, గోదాముల్లో నిల్వ, రవాణా, చలామణి వంటి నిత్యం ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరించటంలో   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలు విఫలమవుతున్న తరుణంలో ఈ కొత్త విధానాల అమలు పెద్ద సవాలు కానుంది. రైతుకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఈ తరహ సమస్యలని పరిస్కరిస్తే కొత్త విధానం ద్వారా మంచి ఫలితాలు పొందే వీలుంటుంది.

Sunday 22 April 2012

కరవు రైతులతో రాజకేయాలు?

మార్చితో ముగిసిన పంట కాలంలో కరవు కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. కరవు రైతుల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ధరలతో పాటు కరవు సాయాన్ని సకాలంలో  అందించి రైతులకు భరోసా ఇవ్వటంలో విఫలమయ్యాయి. రాష్ట్రంలో రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సార్కారు తీరును తప్పు పడుతూ., మళ్ళీ ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసం...  లింక్ చూడగలరు.
                                                                

Wednesday 18 April 2012

పసుపు రైతుల దీనావస్థ!

                                                             
ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 90 శాతం ఆక్రమించిన భారత్ లో ఆ పంట పండిస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. అర్ధం పర్ధం లేని ఎగుమతి దిగుమతి విధానాలతో కేంద్రం రైతుల ప్రయోజనాలను కాలరాస్తోంది. ఎగుమతుల నిషేధంతో దేశీయ రైతులు ధర లేక ఈ ఏడాది భారీ నష్టాలు పొందాల్సి వచ్చింది. వీటికి తోడు వ్యాపారుల మోసాలతో ఉన్న ధర కూడా రైతులకు  అందటం లేదు. పత్తి ఎగుమతుల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని తర్వాత సవరించుకున్న కేంద్రం అదే తప్పును పసుపు విషయంలోనూ పునరావృతం చేసింది. కేంద్ర రాష్ట్రాలు లోపభూయిష్టమైన విధానాలతో రైతుల ప్రయోజనాలు దెబ్బ తీస్తున్న తీరు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోంది. ధరలు పతనమవుతున్న తరుణంలో కనీసం ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మంచి ధరలు అందేలా చూడాల్సిన పరిస్థితుల్లో సర్కారీ నిర్లక్ష్యం క్షమించరానిది. 

Saturday 31 March 2012

అన్నదాతకు విద్యుత్ చార్జీల షాక్!

                                                               
అధికారికంగా ఇచ్చేది ఏడు గంటల కరెంటు. అమలులో రైతులకు అందుతున్నది నాలుగు గంటలు కూడా లేదు. ఇప్పటికే సక్రమంగా విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడుతున్న రైతులపై  ప్రభుత్వం నేడు చార్జీల భారం మోపి వారిని మరింతగా కుంగదీసింది.  పంటల సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్ కు 3 రూపాయల 20 పైసలు వసూలు చేస్తామనడం రైతులకు నిజంగా పెద్ద షాక్! 2014 దాకా కరెంటు చార్జీలు పెంచబోమని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ సర్కారు నేడు దాన్ని విస్మరించిన తీరు శోచనీయం. తాను బకాయి పడ్డం వల్లనే విద్యుత్ సంస్థల్ని సంక్షోభంలోకి నెత్తిన సర్కారు  ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దటం ఘోరం. ఎవరి గొడవలు వాళ్ళు చూసుకుంటున్న రాష్ట్రంలో అసలు ప్రజా సంక్షేమం విస్మరిస్తుండటం అసలైన విషాదం.

Thursday 29 March 2012

సైన్యంలో తెగే తల ఎవరిది?

                                                 
సైన్యంలో మందుగుండు కొరత తీవ్రంగా ఉందని., వైమానిక రక్షణ వ్యవస్థకు కాలం చెల్లి పోయిందని, కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదంటూ ప్రధాని మన్మోహన్ కు ఆర్మీ జనరల్ వీకే సింగ్ రాసిన లేఖ దేశం పరువును బజారుకు ఈడ్చినట్లయ్యింది. పదవీ విరమణ విషయంలో మాట నెగ్గించుకోలేకపోయిన సింగ్, చివరికి రక్షణ వ్యవస్థను వీధిన పడేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నేట్టారనే చెప్పాలి.   అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో జనరల్ సింగ్ తలకాయ తెగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశ భద్రతకు కీలకమైన రక్షణ వ్యవస్థ నేడు వివాదాలకు కేంద్ర బిందువవడం మనం చేసుకున్న దురదృష్టం.

Thursday 22 March 2012

ఉగాది శుభాకాంక్షలు

                                                                 
బ్లాగు మిత్రులందరికీ మన తెలుగు సంవత్సరం  " శ్రీ నందన నామ" ఉగాది శుభాకాంక్షలు. శిశిరంలో ఎండిన చెట్లన్నీ కొత్త చిగుళ్ళు తొడుక్కుని ఈ వసంతాగమన వేళ ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేయడం సౌందర్యారాధకులకు కన్నుల పండుగే. కొత్త పంటలు చేతికందే ఈ సమయంలో నైవేద్యంగా పెట్టే షడ్రుచుల వేప పచ్చడి అనుభూతే వేరు. షడ్రుచులూ సమపాళ్ళలో కలగలిసిన వేప పచ్చడిని తీసుకోవడం ద్వారా ఈ  వత్సర కాలంలో  ఏదీ ఎక్కువా తక్కువా కాకుండా  మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టసుఖాలకు ఉగాది పచ్చడి ప్రతీకగా నిలుస్తుంది.  వసంత ఋతువు ఆగమన వేళ వసంత నవరాత్రులు కూడా ప్రారంభమౌతాయి. తెలుగు పండుగలలో తోలి పండుగగా నిలిచే ఉగాది సకల జీవరాసులకు మనస్సులను రంజింప చేస్తూ., ప్రకృతిని సైతం మనోహరంగా తీర్చిదిద్దగలుగుతుంది. నిన్నటి పాత వాసనల్ని వదిలి సరికొత్త ఆశలతో నందన ఉగాదిని స్వాగతిద్దాం. మరోసారి మీ అందరికీ నందన నామ ఉగాది శుభాకాంక్షలు.

రైతు క్లబ్బులకు "నాబార్డు" చేయూత

                                                             
రాష్ట్రంలో కొత్తగా మరో 600  రైతు క్లబ్బులకు చేయూత ఇవ్వాలని నిర్ణయించినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు "నాబార్డు" నేడు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి ఆఖరికి దేశం మొత్తంలో 91675 క్లబ్బులు ఉండగా., వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లోనే 6594 క్లబ్బులు (7 . 2 శాతం ) ఉన్నాయి. రైతు క్లబ్బుల ఏర్పాటుకు, మూడేళ్ళ పాటు నిర్వహణ ఖర్చులు, నిపుణులతో రైతులకు సలహాలు ఇప్పించడానికి., కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , ఆదర్శ రైతుల పొలాలను పరిశీలించడం వంటి ప్రయోజనకరమైన పనులకు నాబార్డు ఆర్ధిక సహకారం అందిస్తూ ఉంటుంది.
  సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి, రుణాలు, మార్కెట్ పట్ల అవగాహన పెంచడం, వ్యవసాయదారుల సామర్ధ్యం పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల సత్వర అభివృద్ధికి కృషి చేయడమే ఈ రైతు క్లబ్బుల ప్రదాన ఉద్దేశం. అందరూ కలసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రైతు క్లబ్బులు ఉత్తమ వేదికలుగా పని చేస్తున్నాయి. అయితే వీటి పనితీరును మెరుగు పరచడం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులకు  మరింతగా ఉపకరించేలా తీర్చిదిద్దటం నేడెంతో అవసరమని నా భావన. 

Tuesday 20 March 2012

ఓటి బతుకులు

                                                             
మొక్క మొలిచిననాడే...
మళ్ళీ కధ మొదలయ్యింది..
పైరు విత్తుతున్న ప్రతిసారీ...
రైతు గుండెలో విచ్చుకత్తులు దిగుతున్నాయి...
మొక్క ఎదుగుతున్న కొద్దీ..
రైతు బతుకు  గొడ్డుమోతుదవుతోంది...
కాయకష్టం కొండేక్కుతుంటే..
ఊతమిచ్చినవాడే ఊరేగుతున్నాడు..
కర్రు కదిలించినవాడు..
కర్పూరంలా కరుగుతున్నాడు...!
పాదు  ఫలమిచ్చినా ఊతకర్రదే పెత్తనమంతా...
ఏళ్ళు గడుస్తున్నా ఓటి బతుకే రైతులదంతా..!!

ప్రతి తిండి గింజ పై తినేవారి పేరు రాసుంటే...
రైతు నాలుకలపై ఆ బీజాక్షరాలు ఎందుకు లేవు?
కాలం కరుగుతున్నప్పుడల్లా...
కొత్త అప్పులు పెరుగుతున్నాయి....
పంట పండుతున్న ప్రతిసారీ...
రైతు డొక్కలు ఎండుతున్నాయి...!
జీవనసారాన్ని ఔపోసన పట్టిన రైతుకు...
మార్కెట్ మాయలు అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే..!
పదే పదే పడి లేస్తున్న ప్రయాసలో...
పాపం..
రైతు బతుకంతా ఓ జూదమే!!

Friday 16 March 2012

వ్యవసాయాన్ని విస్మరించిన బడ్జెట్!

                                                          
కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేడు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ సబ్సిడీల కోత పనుల మోత చందంగా ఉంది. ఆహార భద్రతకు పూర్తీ రాయితీలంటూనే ఇతర సబ్సిడీలకు కోత పెట్టారు. వ్యవసాయ సంస్కరణల ఊసే లేకుండా ఉన్న ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. రైతులకు ఎరువుల సబ్సిడీని సైతం నగదు రూపంలో అందజేయనున్నట్టు స్పష్టం చేసారు. వ్యవసాయ ఉత్పతుల మద్దతు ధరల స్థిరీకరణ నిధికి నిధులు కేటాయించడాన్ని విస్మరించారు. లక్ష కోట్ల పంట రుణాలను పెంచినప్పటికీ, నేటికీ రైతులకు ఇస్తున్నరుణాలు నూటికి  30 శాతానికి దాటలేదన్న సంగతిని సర్కారు గుర్తించాలి. అలానే మార్కెట్ సంస్కరణలు, పరిశోధనా, విస్తరణకు ఆశించిన రీతిలో పెట్టుబడులు కేటాయించలేదు. మెత్తంగా అన్ని వర్గాలపై పన్నుల భారం మోపిన ప్రణబ్ బడ్జెట్ కీలకమైన వ్యవసాయాన్ని విస్మరించి రైతులోకానికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.

Wednesday 14 March 2012

యువతకు ఉపాధి చూపే చెరకు రసం తయారీ యంత్రాలు

                                                                
చెరకు సాగు రాష్ట్ర రైతులకు చేదునే మిగుల్చుతోంది. చక్కెర మిల్లులు సైతం పర్మిట్లు ఇవ్వకుండా రైతుల  సహనాన్నిపరీక్షిస్తున్నాయి. టన్ను చెరకుకు కేవలం రెండు వేల ధర మాత్రమే ఇస్తూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇస్తున్న స్థాయిలొనూ  రాష్ట్ర సలహా ధరను ఇవ్వకుండా సర్కారు రైతుల్ని మోసగిస్తోంది. ఏటా ఎదురవుతున్న  ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో చెరకును మిల్లులకు తరలించలేని రైతులు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న వారు స్వయం ఉపాధిగా చెరకు రసం తీసే యంత్రాలను ఏర్పాటుచేసుకుని లాభాపడవచ్చు. ముఖ్యంగా యువతకు ఈ ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయి. నేడు మనం రోడ్లపై చూస్తున్న చేతితో నడిపే లాంటివి కాకుండా ఇన్ స్టంట్ కూలింగ్ సదుపాయమున్న ఈ యంత్రాలు నేడు హైదరాబాద్లో ( 93944 93944 - రాంగోపాల్ )తయారుచేస్తున్నారు. ఆ వివరాలతో రాసిన నా వ్యాసం మార్చి నెల "అన్నదాత" లో ప్రచురితమైంది. స్కాన్ చేసిన కాపీ ని ఇక్కడ లింక్ చేస్తున్నాను. మీ కోసం.
                                                                 

Friday 9 March 2012

బేళ్ళు కావు... ఉరితాళ్ళు!

                                                                

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ చేసిన ఒక చెత్త పని వల్ల దేశంలో పత్తి ధరలు పడిపోయాయి. క్షేత్ర స్థాయిలో రైతుల స్థితిగతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. అంతర్జాతీయంగా గిరాకి కొనసాగుతున్నా పత్తి నిల్వలు పుష్కలంగా ఉన్నా ఇవేమీ పట్టించుకోకుండా ఆనంద్ శర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయం. ఒక వ్యూహం లేకుండా ఎగుమతి దిగుమతి విధానాలను రచిస్తున్న కేంద్రం దేశంలో కోట్లాది పత్తి రైతుల ఆశలపై నీళ్ళు చల్లింది. జరిగిన పొరపాటును గ్రహించి నేడు దిద్దుబాటు చర్యల గురించి ఆలోచించమని ది గ్రేట్ మన్మోహన్ గారు ప్రణభ్ ను పురమాయించారు. ధరల పతనానికి దారితీస్తున్న జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ కాపీ ని మీ కోసం ఇక్కడ జతచేస్తున్నాను.
                                                                   

Wednesday 7 March 2012

మహిళా నీకు వందనం

                                                           
నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రెండేళ్ళ కిందట నూరు వసంతాల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన మర్నాడు మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. మహిళాలోకానికి కొత్తగా సంక్రమించే మూడోవంతు రాజకీయ సాధికారిత కొత్త ఉత్సాహం నింపింది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న స్త్రీలకు చట్ట సభల్లో 33 . 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు చట్టం కావాలని నారీలోకం ఎదురు చూస్తోంది. 189 దేశాలకు సంబంధించి చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య పరిశీలించినప్పుడు భారత్ 108 వ  స్థానంలో ఉంది. అన్నింటికీ మించి దేశంలోని రాజకీయ పార్టీల స్థానాల్లో కనీసం 40  శాతం మహిళలకు కేటాయించే విధంగా చట్టం తేవాలన్న వాదన గట్టిగానే ఉంది. పురుషుల ధోరణిలోనూ ఎంతో మార్పు రావాలి. గృహహింస, దోపిడీ, అసమానతలకు ఇకనైనా తెరపడాలని ఆశిద్దాం. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు సంఘీభావం ప్రకటించే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ మహిళాలోకానికి మరోసారి శుభాకాంక్షలు.

Saturday 3 March 2012

వరల్డ్ రికార్డ్ హీరో బీహార్ రైతు సుమంత్ వరి సాగు వివరాలు

                                                                
"శ్రీ" వరి సాగులో ప్రపంచ రికార్డు సృష్టించిన బీహార్ రైతుల గురించి గతంలో ఒక పోస్టు రాసిన సంగతి మీకు తెలుసు. మార్చి నెల "అన్నదాత" వ్యవసాయ పత్రికలో ఈ వ్యాసం ప్రచురితమైంది. అయితే ఈ వ్యాసంలో "శ్రీ" వరి సాగుకు సంబంధించి మరిన్ని సంగతులు వివరంగా ఇవ్వడం జరిగింది. ప్రపంచ రికార్డు సృష్టించిన సుమంత్ కుమార్ తో నేను మాట్లాడాను. అతను వాడిన విత్తనం, అనుసరించిన పద్దతులు తదితర వివరాలను  ఈ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. స్కాన్ చేసిన కాపీ ని ఇక్కడ జత చేస్తున్నాను.
                                                            

Friday 2 March 2012

సిమ్లాలో రాణించిన తెలుగు రైతు

                                                                        
జనవరి 'అన్నదాత' మాసపత్రికలో యాపిల్ సాగులో రాణిస్తున్న తెలుగు రైతు పురుషోత్తమరావు గురించి ఒక వ్యాసం రాశాను. త్వరలో వీరు సిమ్లా నుంచి హైదరాబాద్ కు ఆర్గానిక్ యాపిల్స్ ను తీసుకువచ్చి విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యాసం చదివిన ఎందరో పురుషోత్తమరావు సెల్ నెంబర్ కావాలని నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇటీవల వారు ఇటలీ వెళ్లి రావడం వల్ల నేను ఇచ్చిన నెంబరు కలవకపోవడం జరిగింది. ప్రస్తుతం వారు హైదరాబాద్ లోనే ఉన్నారు. అలానే పలువురు ఈ వ్యాసం క్లిప్పింగ్ కావాలని కోరారు. వారి సౌకర్యార్ధం అన్నదాతలో ప్రచురితమైన వ్యాసం స్కానింగ్ కాపీని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.  వారి సెల్ నెంబర్-  09218534124 . 
                                                                 

Tuesday 21 February 2012

వ్యవసాయం పట్టని ప్రభుత్వమిది!-జేపీ

                                                            

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ రైతాంగ సమస్యలపై  ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కిలో కందిపప్పు ధర రూ. 100 అయినప్పుడు గగ్గోలు పెట్టిన నాయకులు నేడు రైతుకు కిలో కందిపప్పుకు కేవలం రూ. 30 ధర వస్తోంటే నోరుమెదపడంలేదని విమర్శించారు. ఉత్పత్తులకు తగిన ధర కల్పించలేని ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల ప్రభుత్వంగా భావించాలా  అని ప్రశ్నించారు. తన చేతకాని విధానాలతో రైతుల పరిస్థితిని దిగజార్చిన ప్రభుత్వం, వారిని నిలువునా మోసగిస్తోందని, విద్యుత్ కోతలతో అటు రైతుల్ని ఇటు పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతోందంటూ జేపీ కిరణ్ సర్కారు వైఖరిని తూర్పార పట్టారు. క్షేత్ర స్థాయిలో రైతుల దుర్గతిని పట్టించుకోకుండా ప్రభుత్వం మన్ను తిన్న పాములా వ్యవహరిస్తే రైతుల బాగోగుల్ని ఎవరు పట్టించుకున్తారని నిగ్గదీశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతుల నికరాదయం తగ్గుతోందని, ఆ మేరకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దున్న పోతుపై వాన పడ్డ చందంగానే ఉంది.

Saturday 18 February 2012

రైతుకు మద్దతు ధరలిచ్చి ఆదుకోండి!

                               
                                                   
రాష్ట్రంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను కూడా మిల్లర్లు అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బోనస్ సైతం అందించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. "అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు" చందంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి మంచి రేటు వచ్చే ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా రైతుల్ని అడ్డుకుంటోంది. రైతులు స్వేచ్చగా ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సిగ్గుచేటు. దీన్ని నిరసిస్తూ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఈ రోజు ఉదయం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుంచి కర్ణాటకలోని గిల్కసూగుర్ వరకు "రైతు సత్యాగ్రహ పాదయాత్ర" చేపట్టారు. వ్యవసాయానికి అయ్యే ఖర్చు 40 నుంచి 50 శాతం పెరిగితే ప్రభుత్వాల విధానాల వల్ల రైతుకు లభించే రేటు 30 - 40 శాతానికి పడిపోయిందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించి కర్ణాటకలో ధాన్యాన్ని విక్రయిస్తామని చేతనైతే దీన్ని అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చట్ట విరుద్ద ఆంక్షల్నిఉల్లంఘించడం వినా రైతులకు మరో మార్గం లేదంటున్న జేపీ, తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు మేలు చేస్తే చాలంటున్నారు. జేపీ నిబంధనల్ని ఉల్లంఘించడం అటుంచి కేంద్రం ఆదేశాల్ని అమలు చేయకుండా రైతుల్ని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి శిక్ష వేయాలి..? ఈ పాలకుల్ని ఇంకా ఎందుకు ఉపేక్షించాలి..? ప్రభుత్వం జేపీ పాదయాత్ర తర్వాతైనా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

Wednesday 15 February 2012

రాష్ట్రంలో జీరో బడ్జెట్ వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ సదస్సులు

                                                             
సహజ వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ దేశంలో ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తోన్న సుభాష్ పాలేకర్ గురించి ఆంధ్ర ప్రదేశ్ రైతులకు సుపరిచితమే. ఆయన అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ఆచరించేందుకు మన రాష్ట్రానికి చెందిన కొందరు పాలేకర్ ను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి రైతులకు రెండేళ్లుగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 18  నుంచి 22 వ తేదీ వరకు తిరుపతిలో జీరో బడ్జెట్ వ్యవసాయం పై  ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతి సదస్సు గురించి 09849059573 ఈ నెంబరులో సంప్రదించవచ్చు.
అలానే ఏప్రిల్ 1  నుంచి 5 వ తేదీ వరకు హైదరాబాద్ లో సైతం ఇటువంటి సదస్సు జరగనుంది. హైదరాబాద్ లకడికపూల్ లో ఉన్న మారుతి గార్డెన్స్ లో జరగనున్న ఈ సమావేశానికి ఆసక్తి ఉన్న రైతులు హాజరు కావచ్చు. పర్యావరణ ఉద్యమకారుడు "సేవ్" సంస్థ నిర్వాహకుడు అయిన విజయరాం హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040 - 27654336 నెంబరులో సంప్రదించవచ్చు.

Friday 3 February 2012

ప్రతి బొట్టు నీటికీ లెక్కలు చెప్పాలంట...?

                                                             
భవిష్యత్తులో ప్రతి నీటి బొట్టు వినియోగానికి లెక్కలు చెప్పాలని మంగళవారం విడుదలైన జాతీయ జలవిధానం ముసాయిదా నిర్దేశిస్తోంది. ప్రస్తుతం సేవలు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా సేవలు నియంత్రించే సంస్థలుగా మారాలంటోంది. ఇప్పటికే తక్కువగా ఉన్న జల విద్యుత్ ధరలను పునః సమీక్షించాలంటోంది. నీటి సరఫరాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వ్యత్యాసాన్ని తగ్గించాలన్నది ఈ ముసాయిదాలోని మరో కీలకాంశం. రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి పనిచేస్తున్న పలు   ట్రైబ్యునళ్ళ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఒకే ట్రైబ్యునల్ ఉండాలని ముసాయిదా ప్రతిపాదించింది. ఫెడరల్ విధానాన్ని తుంగలో  తొక్కి దేశం మొత్తం ఒకే జలవిధానం అంటూ సరళీకరణ ఆర్ధిక విధానాలను మరింతగా రాష్ట్రాలపై రుద్డటమే లోగుట్టనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రణాలికా సంఘం ఉచిత విద్యుత్తుపై ఆక్రోశం వెళ్ళగక్కిన నేపధ్యంలో కొత్త జలవిధానం అమలైతే రాష్ట్ర రైతులకు ఉచిత విధ్యుత్ అందే అవకాశం ఉండకపోవచ్చు. అలానే భూగర్భ జలాలకు సెస్సు వసూలు చేయాలని పేర్కొన్న దృష్ట్యా కేంద్రం ఆమ్ ఆద్మీని కాల్చుకుతినే ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోదని స్పష్టమవుతోంది.
                                                                  

అలానే నీటిని ప్రైవేటీకరిస్తే ప్రతి చుక్క నీటిని లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే అవకాశముంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీటి పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. నీటిని అందించలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని గతంలో సుప్రీంకోర్ట్ చేసిన వ్యాఖ్యలతోనైనా పాలకులకు జ్ఞానోదయం కాకపోవడం నేటి విషాదం.  మొత్తానికి నీటిని ఆర్ధిక వస్తువుగా గుర్తించి సమర్ధ వినియోగానికి పెద్ద పీత వేయాలన్నదే ఈ జాతీయ జల విధానం అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. 

Monday 30 January 2012

"శ్రీ"వరి సాగులో బీహార్ రైతుల ప్రపంచ రికార్డ్

                                                      
బీహార్ కు చెందిన ఐదుగురు రైతులు సాధించిన అపూర్వ విజయమిది. వీరంతా చైనాకు చెందిన ఒక రైస్ బ్రీడర్ సాధించిన ప్రపంచ రికార్డును తిరగ రాశారు. వరి సాగులో ఈ రైతులు సాధించిన విజయం వెనుక అక్కడి వ్యవసాయ అధికారుల కృషి ఎంతో ఉంది. బీహార్లోని నలంద జిల్లా కత్రిసరాయ్ బ్లాక్ లోని దార్వేష్ పురా అనే ఓ మారుమూల గ్రామం ఈ ప్రపంచ రికార్డ్ కు వేదిక కావడం విశేషం. ఈ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు " శ్రీ "  సాగు పద్ధతిలో (సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్)  వరి సాగు చేసి హెక్టారుకు 224 క్వింటాళ్ళ (22 .4 టన్నులు) ధాన్యం దిగుబడిని సాధించారు. ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన యువ రైతు సుమంత్ కుమార్ ఈ రికార్డ్ ను సాధించిన రైతుగా ప్రపంచ ఖ్యాతిని అందుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ అనే రైతు 220  క్వింటాళ్ళు., నితీష్ కుమార్ అనే రైతు 196 క్వింటాళ్ళు.,  రామానంద్ సింగ్ 192  క్వింటాళ్ళు.,  సంజయ్ కుమార్ 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించడం అపూర్వం. వీరిలో ఒకరు మాత్రం గతంలో చైనా నెలకొల్పిన రికార్డును సమం చేయగా మిగిలిన నలుగురూ దాన్ని బ్రేక్ చేశారు. చైనాకు చెందిన యాన్ లాంగ్ పింగ్ అనే రైస్ బ్రీడర్ 2004 లో DH-2525 అనే వరి వంగడాన్ని వాడి హెక్టారుకు 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి రికార్డ్ ను నెలకొల్పాడు. ఇతన్ని చైనాలో " ఫాదర్ అఫ్ హైబ్రిడ్ రైస్ " గా పిలుస్తారు. 
                                                
బీహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ అరవింద్ సింగ్., జిల్లా వ్యవసాయాధికారి సుధామ మహతో తదితరులు సుమంత్ అతని సహచరుల పొలాలకు వెళ్లి స్వయంగా ఈ రికార్డ్ దిగుబడికి నెలవైన పంట పొలాలను పరిశీలించి వచ్చారు. నలంద జిల్లాలో 2008 లో మొదలైన " శ్రీ " సాగు విధానం వల్ల దాదాపు 25 వేల మంది రైతులు నేడు ఈ పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. తమ రైతులు సాధించిన ఈ విజయాలతో పొంగిపోయిన బీహార్ డైనమిక్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశంలో రెండో హరిత విప్లవం బీహార్ నుంచే ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

నిజానికి బీహార్ లో "శ్రీ " వరి సాగులో ఇంత విప్లవం రావడం వెనుక మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించిన సహకారం కొంత ఉంది. 2003 లో ఒక రకంగా దేశంలో తొలిసారిగా మన రాష్ట్రం "శ్రీ " వరి సాగుకు శ్రీకారం చుట్టింది. 1983 లో మడగాస్కర్లో  ప్రపంచంలో తొలిసారి "శ్రీ " సాగు పద్దతి మొదలయ్యాక నేడు విశ్వ వ్యాప్తమైంది. మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఈ పద్ధతిని పాటించాక దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన నుంచి స్పూర్తిని పొందాయనే చెప్పాలి. అప్పట్లో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా ఉన్న డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ  అప్పటికే శ్రీలంక లో సాగులో ఉన్న "శ్రీ" సాగు విధానాన్ని పరిశీలించి వచ్చి మన రాష్ట్రంలో ఈ పద్దతిని ప్రోత్సహించారు. వారి కృషి వల్ల " శ్రీ" సాగు అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 2004 లో రాష్ట్రానికి చెందిన గుడివాడ నాగరత్నం నాయుడు అనే రైతు హెక్టారుకు సుమారు 17 . 25 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి జాతీయ స్థాయిలో ఆదర్శ రైతుగా నిలిచారు. 
                                                              
అదే కాలంలో బీహార్ రాజధాని పాట్నా లో ఉన్న  Directorate of rice Developement  డైరెక్టర్ గా ఉన్న దివాకర్ మన విశ్వవిద్యాలయానికి వచ్చి " శ్రీ " సాగులో శిక్షణ పొంది, మెలకువలు తెలుసుకుని తన రాష్ట్రంలో ఈ పధ్ధతి వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. దీని ఫలితంగా నేడు బీహార్లోని ఒక్క నలందా జిల్లాలోనే 90 శాతం మంది రైతులు   "శ్రీ " పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. 2005 లో సత్యనారాయణ గారు పదవీ విరమణ చేశాక " శ్రీ " సాగు వ్యాప్తి గురించి విశ్వవిద్యాలయంలో ఆశించిన మేరకు కృషి జరగలేదు. వ్యవసాయ శాఖతో సహా ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా మన రాష్ట్రంలో ఈ పద్దతిని పరిశీలించిన బీహార్, బంగ్లాదేశ్, అస్సాం, బెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు " శ్రీ " సాగుతో  విప్లవాత్మక మార్పులు  తీసుకు వస్తే.,  మన రైతులు మాత్రం ఆరేళ్ళు  గడిచినా "శ్రీ" వ్యాప్తికి ముందుకు సాగలేక పోయారు. సత్యనారాయణ గారు అందించిన సహకారంతో పాటు స్వయం కృషితోనే నాగరత్నం నాయుడు వరి సాగులో అధిక దిగుబడులు సాధించగలిగారు.  నేడు ఆయన ఒక్కరే "శ్రీ " పద్దతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా తోటి రైతులకు సేవలందిస్తున్నారు. 
సుమంత్ అనే యువ రైతు సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుందాం.

Friday 27 January 2012

కరవు కష్టం చూసేందుకు ఇప్పుడా వచ్చేది?

                                                                     
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సుమారు 34 .24 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ లో మొదలైన కరవు నేటికీ రబీ లోనూ కొనసాగుతుండటం రైతుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రైతుకు అంతకు మించిన విచారం ప్రభుత్వ సహాయ నిరాకరణ రూపంలోనూ ఎదురైంది. ఖరీఫ్ కరవు పరిస్థితులపై కేంద్రానికి నివేదించిన రాష్ట్రం తగిన సహాయాన్ని పొందటంలోనూ, స్వయంగా రైతులకు తానూ సహాయం చేయడంలోనూ విఫలమైంది. కరవు తీవ్రతను తెలుసుకునేందుకు, రైతులకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఫిబ్రవరి 5 న రాష్ట్రంలో పర్యటించనుంది. కరువొచ్చిన ఆర్నెల్లకు కేంద్ర బృందం ఏం చూసి రైతుకు సహాయ పడుతుందో ఏలిన వారికే తెలియాలి. 
                                                                
గత కొన్నేళ్లుగా రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం మాని చేష్టలుడిగి చూస్తున్నాయి. కేంద్రం సైతం ఆంధ్ర ప్రదేశ్ పట్ల సవతి ప్రేమ చూపుతోంది. ఇటీవల "థానే" తుపాన్ దెబ్బ తగిలిన తమిళనాడుకు కేంద్రం తక్షణ సాయంగా రూ. 600 కోట్లు ప్రకటించింది. అటువంటి భారీ నష్టాలను ఇటీవలి  కాలంలో తరచుగా చవిచూసిన ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోంది. కోరిన సాయంతో పోల్చితే ముష్టి విదిల్చినట్టు నామమాత్రపు సాయం ప్రకటిస్తున్న కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రైతుల జీవితాలతో ఆటలాడుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతు శ్రేయాన్ని గాలికి వదిలేసింది. రైతాంగం ఇంత తీవ్ర కరవు కష్టాల్లో ఉండగా వారిని ఆదుకునేందుకు నోరు మెదపని మన ఎంపీలను ఏం చేయాలి...? రాజకీయాలు లేదా వారి సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప  వీరు ప్రజలకు చేస్తున్నదేమిటి..? వీరి నిర్లక్ష్యానికి తగిన జవాబు చెప్పేందుకు రైతులు సంసిద్ధం కావాలి. రైతులకు ఇచ్చే పరిహారంలోనూ వాటాలు పంచుకునే నీతిలేని నాయకులకు పార్టీలకు అతీతంగా రైతులు గట్టి జవాబు చెప్పాలి.