Wednesday 24 December 2014

భారత రత్నాలు




దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన అటల్ బిహారీ వాజ్ పేయికి, పండిట్ మదన్ మోహన్ మాలవ్య లకు భారత అత్యున్నత పురస్కారం " భారతరత్న" ప్రకటించడం మనల్ని మనం గౌరవించుకోవడమే. 31 ఏళ్ళకే పార్లమెంటు సభ్యుడై దేశసేవ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన  అజాత శత్రువు ఆయన.  అగ్రరాజ్యాల బెదిరింపులకు భయపడకుండా అణుపరీక్షలు నిర్వహించడంలో, దేశ రక్షణ విషయంలో రాజీపడకుండా వ్యవహరించడంలో ఆయన చూపిన సమర్ధ నాయకత్వం ప్రశంసనీయం, 3 సార్లు ప్రధానిగా వ్యవహరించిన అటల్ జీ ఎన్నో విప్లవాత్మక చర్యలతో సమర్ధ ప్రధానిగా సుస్థిర పాలనను అందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకునిగా పేరు పొందిన మదన్ మోహన్ మాలవ్య సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. దేశానికి స్వాతంత్ర్యం లభించటానికి ఏడాది ముందే తనువు చాలించిన ఈ మహామేధావికి భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచితం.  వీరిరువురూ భారతరత్నాలే.


   

Tuesday 23 December 2014

అపరాల రైతుకు ఆదరువేదీ?

హరిత విప్లవానంతరం సారవంతమైన నేలల నుంచి వర్షాధారపు భూములకు మళ్ళించాక దేశంలో పప్పుదాన్యాల సాగు, సాగుదార్ల  పరిస్థితి దయనీయంగా  మారింది. దశాబ్దాలు గడుస్తున్నా విస్తీర్ణం, ఉత్పత్తి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని విశ్లేషిస్తే., రెండు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకటి.. దేశ ప్రజల్లో  పోషక విలువలు తగ్గిపోవడం, రెండోది ఈ పంటలు సాగు చేసే రైతులు అప్పులపాలవటం... దేశంలో ఈ పంటల సాగు వృద్ధి చెందకపోవడానికి దారితీసిన పరిస్థితులు, దిగుబడులు పెంచేందుకు ఉన్న అవకాశాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం నా వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                         

దర్శక శిఖరం బాలచందర్

                                                                         

ఒక మరోచరిత్ర, ఒక అంతులేని కథ.., ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్... సెల్యులాయిడ్ సంచలనాలైన ఇటువంటి కళాఖండాలను ఇక చూడలేము., వెండితెర వెలిగినన్నాళ్ళూ చిరస్థాయిగా నిలిచే సినిమాలు తెరకెక్కించటమేగాక, జాతి గర్వించే మేటి నటుల్ని అందించిన దర్శక శిఖరం బాలచందర్ ఇక లేరనే బాధ గుండెల్ని పిండేస్తోంది. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ... 

Monday 8 December 2014

ఊరూరా జీవధారలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు జీవనాధారమైన వేలాది చెరువులు నేడు ధ్వంసమయ్యాయి. కాకతీయుల కాలం నుంచి చెరువుల చుట్టూ పెనవేసుకున్న ప్రజల జీవితాలను ఈ చెరువుల విధ్వంసం  ఆ తర్వాత కాలంలో తీవ్రంగా ప్రభావితం చేసింది. కెసీఆర్ ప్రభుత్వం "మిషన్ కాకతీయ" పేరుతొ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపడుతోంది. చెరువుల పునరుద్ధరణ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంలా సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు తెలంగాణ ఎడిషన్ ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                             

Sunday 9 November 2014

చౌ మహల్లా అందాలు.... సుల్తాన్ల సంపదలు

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఉంటున్నా ఇంకా నగరంలో కొన్ని విశేషాలను నేనిప్పటికీ చూడలేదనే వెలితి అప్పుడప్పుడు నన్ను బాధిస్తూ ఉంటుంది. వృత్తిపరమైన వత్తిళ్ళు, ఇతరత్రా పనులతో తీరిక లేకుండా ఉండటంతో అది సాధ్యపడలేదని నా మనసు సమర్ధించుకోవచ్చు. ఇటీవల నా సహచరుడు నాగరాజ్ చౌ మహల్లా ప్యాలెస్ కు వెళ్లివచ్చి నా పనిని మరింత తేలిక చేసాడని చెప్పాలి. ఎట్టకేలకు ఈ ఆదివారం చౌ మహల్లా ప్యాలెస్ దర్శన భాగ్యం కలిగింది. ప్యాలెస్ గురించి తెలుసుకునే ముందు కొంచెం క్లుప్తంగా గోల్కొండ సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే చాలా విషయాలు అవగతమవుతాయి.
ప్రాణభయంతో 1467 తర్వాత సొంత దేశం టర్కీ నుంచి పారిపోయి దక్కన్ ప్రాంతానికి చేరిన సుల్తాన్ కులీ అనంతర కాలంలో కుతుబ్ షాహీల సామ్రాజ్యాన్ని గోల్కొండలో పాదుకొల్పాడు. ఈ వంశీకుల పతనపు రోజుల్లో అంటే .,
1687లో అబ్ధుల్లాఖాన్ అనే దేశద్రోహి కోట రహస్యం చెప్పడంతో గోల్కొండ కోట మొఘలాయిల వశమై కుతుబ్ షాహీల పాలన ముగిసింది. మొఘల్ చక్రవర్తుల సుబేదార్లుగా ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ రాజ్యంలో అసఫ్ జాహీల పాలన (నిజాం)మొదలైంది. 1707లో ఔరంగజేబు మరణానంతరం దేశంలోకి ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు వాళ్లు చొచ్చుకురావటం ఆరంభించారు. తర్వాత నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్ కు మార్చి అసఫ్ జా బిరుదుతో దక్కన్ పాలకుడయ్యాడు. ఇతని తర్వాత రెండో కొడుకైన నాసిర్ జంగ్ కు అతని మేనల్లుడు ముజాఫర్ జంగ్ కు మధ్య వారసత్వ విభేదాలు పొడసూపాయి. 1750 లో నాసిర్ హత్య తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే సహకారంతో ముజఫర్ సుబేదారు అయ్యాడు. 1751 లో ముజఫర్ మరణానంతరం నాసిర్ రెండో తమ్ముడైన నిజాం అలీఖాన్ కు అధికారం దక్కకుండా మొదటి తమ్ముడైన సలాబత్ జంగ్ ను ఫ్రెంచ్ సేనాని బుస్సీ సుబెదారుని చేశాడు. ఇక ప్యాలెస్ విషయానికి వస్తే....,
1750లో సలాబత్ జంగ్ నిజాం అయ్యాక తన రాజప్రసాదంగా చౌ మహల్లాని కట్టించాడని చరిత్ర చెబుతోంది. ఈ  మహల్ టెహ్రాన్ లోని పర్షియా రాజ ప్రసాదాన్ని పోలి ఉంటుంది. ప్యాలెస్ లో నిజాం నవాబులు  జర్మని, ఫిన్లాండ్, టర్కీ, చైనా తదితర దేశాల నుంచి తెప్పించి ఉపయోగించిన పింగాణి సామగ్రి ని ప్రదర్శనకు ఉంచారు. అలాగే వారి కాలంలో వాడిన దుస్తులు, అరుదైన కళాత్మక వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక కత్తులు, కటార్లు, సైనిక సామాగ్రికి అంతేలేదు. వారు వాడిన ఖరీదైన రోల్స్ రాయిస్ కారు, ఇతర వింటేజ్ కార్లు, బగ్గీలు  రాజముద్రలు ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా మహల్ లోని భవనాల పై కప్పునకు ఉపయోగించిన డిజైన్లు చూడముచ్చటగా ఉన్నాయి. నేడు మనకు ప్రియమైన వారికి వారి ఫొటోలతో కూడిన పెద్ద పెద్ద టీ కప్పులను బహుకరిస్తుంటాం. ఇటువంటి వారి ఫొటోలతో కూడిన టీ కప్పులను 5 శతాబ్దాల క్రితమే నవాబులు జర్మని నుంచి తెప్పించారు. అసఫ్ జాహీలు ఎలా పరిపాలించారనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే., సంపదలతో వారెలా తులతూగారో హైదరాబాద్ లో వాళ్ళు నిర్మించిన చౌ మహల్లా, చార్మినార్, రోషన్ మహల్, గుల్షన్ మహల్, షాదీఖాన, దర్గా హుస్సేన్ షావలి, కింగ్ కోటి రాజ ప్రసాదం తదితర భవనాలను చూస్తేనే తెలుస్తుంది. 
ముఖ్యంగా చౌ మహల్లా ప్యాలెస్ భవంతులు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక్కో భవనం నిర్మించిన నాటి ఇంజనీర్ల నైపుణ్యం, కళాకారుల పనితనం ఎంతో ముచ్చటేస్తుంది. ఫౌంటెన్లు , గార్డెన్లను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఆర్చీలు, డోమ్, స్తంభాలు కుతుబ్ షాహీల నిర్మాణ ప్రత్యేకతలు. నల్లరాతితో పైన అలంకరణలు, ఎనామిల్ పనితనం మొదలైన వాటిని టర్కిష్ శిల్పకళ నుంచి తీసుకుని భారతదేశ శిల్పకళతో సమ్మిళితం చేసి రూపొందించిన శిల్ప కళ వీరిది. వీరి వాస్తు శిల్పకళ అరేబియన్, ఇరానియన్, టర్కిష్, భారతీయ కళల సమ్మేళనంగా చెప్పవచ్చు.  ఇరాన్ తదితర దేశాల నుంచి తెప్పించిన షాండ్లియర్లు ప్రత్యేక ఆకర్షణ. తన నగరం నీటిలో చేపల్లాగా ప్రజలతో నిండి కళకళలాడాలని మహమ్మద్ కులీ కోరుకున్నట్టు  '' మేరా షహర్ లోగోం సే మామూర్ కర్ రఖియాజా  తూ దరియామె మీర్, యా సమీ " ఆధునిక హైదరాబాద్ నేడు వెలుగొందుతోంది.
                    (మిత్రులు వేదగిరి రాంబాబు రచించిన "నాలుగు శతాబ్దాల నగరం" పుస్తకం నుంచి...)
                                                                                         












Friday 7 November 2014

వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి

వాచస్పతి బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావు గారి గురించి నేటి తరంలో తెలియనివారు లేరంటే అతిశయోక్తి లేదు. వారు కురిపించే ప్రవచానామృతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో సనాతన ధర్మాసక్తులు ఆస్వాదిస్తున్నారు. సమకాలీన ప్రవచనకర్తలలో అత్యుత్తములైన  సరస్వతీ పుత్రులు వారు. శ్రీనగర్ కాలనీ లోని సత్యసాయి నిగమాగమంలో ఈ నెల 6వ తేదీ నుంచి సుందరకాండపై వారు చెప్తున్న ప్రవచనం వినేందుకు వెళ్ళినప్పుడు ఆది దంపతులైన బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావు దంపతులతో సంభాషించిన సందర్భంలో నాకు దక్కిన జీవితకాలపు మధుర జ్ఞాపకం.
                                                   
                      

Wednesday 29 October 2014

ప్రముఖులతో కాసేపు....

వివిధ రంగాల ప్రముఖులతో భావజాల మార్పిడి...
సెంటర్ ఫర్ హ్యుమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆధ్వర్యంలో...
గత రాత్రి సరదాగా నిజాం క్లబ్ లో...
పాల్గొన్న ప్రముఖులతో నేను...
శ్రీ పద్మనాభయ్య, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, శ్రీ ద్వారకా తిరుమలరావు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్.,   శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ., శ్రీ ఎంవీ కృష్ణారావ్, నగర మాజీ పోలీస్ కమిషనర్., శ్రీ కే.సి. రెడ్డి, సిరియాలో ఐక్యరాజ్యసమితి మాజీ సలహాదారు., శ్రీ పీవీ రమేష్, ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి., శ్రీ రాజకుమార్, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి., హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ  ఉపకులపతి రామకృష్ణ రామస్వామి., సిహెచ్ ఎస్ ఎస్ డైరెక్టర్ డా. కన్నెగంటి రమేష్ బాబు., తులసి సీడ్స్ డైరెక్టర్ కృష్ణ చైతన్య, న్యాయవాది విజయ్ కుమార్.
                                                                     

Wednesday 22 October 2014

దీపావళి పండగ శుభాకాంక్షలు

                                                                         
ఆనందమయ జీవితానికి అసలైన నిర్వచనమిచ్చే పండుగే దీపావళి. దీపాల వెలుగులో లక్ష్మిని ఆరాధించి దారిద్ర్యాన్ని పారద్రోలి సంపదలు పొందే పండగ., చీకటిని చీల్చుకుంటూ వెలుగులతో నిండిపోయే పండుగ దీపావళి. మిత్రులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

Monday 13 October 2014

తెలుగు రైతులకు కష్టకాలం

వర్షాభావం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తే ., తాజాగా సంభవించిన హుద్ హుద్ తుపాన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంటలను అతలాకుతలం చేసింది. రుణమాఫీ అమలు ఆలస్యమై రైతులు అప్పులు తెచ్చి పంటలు సాగు చేసుకున్న తరుణంలో పులి మీద పుట్రలా తాజా నష్టాలు రైతుల్ని కోలుకోనీయకుండా దెబ్బతీశాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రబీ సీజన్ ను రైతులకు ఎలా ఆశావహంగా మలచాల్సిన అవసరమున్నదో విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.  మీ కోసం ఈ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                           
                      

Thursday 2 October 2014

ప్రజలకు విజయోస్తు!

                                                                             

శుభశక్తులకు విజయం ., దుష్ట శక్తులకు పరాజయం...  విజయదశమి పర్వదినం లోని అంతరార్ధమిదే. సాటి మనుషులపై అకారణ ద్వేషం, అసూయ., అజ్ఞానం., అహంకారం., స్వార్ధబుద్ధి., కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే నైజం... ఇటువంటి అసుర లక్షణాలపై మంచి సాధించిన విజయమే ఈ పండగ మనకు నేర్పే గొప్ప నీతి. ఆ మంచిని స్వీకరిద్దాం... పొరుగు వారిని ప్రేమిద్దాం... మానవత్వాన్ని పంచుదాం. దసరా పర్వదినం సందర్భంగా తెలుగు వారికి విజయోస్తు!   

Tuesday 23 September 2014

అపూర్వ విజయం భారత్ సొంతం

                                                                             
ఇది నిజంగా చరిత్రే. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా భారత్ నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయమిది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా., ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. జపాన్, చైనా వంటి దేశాలకు సాధ్యం కాని విజయాన్ని భారత్ నమోదు చేయటం ఈ విజయం ప్రత్యేకత. ఇస్రో సాధించిన ఈ విజయంతో ఇతర రంగాలు స్ఫూర్తి పొందాలి. అరుణ గ్రహంపై మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రవేశంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "ఇస్రో" శాస్రవేత్తలకు పేరు పేరునా అభినందనలు. భారతీయులకు శుభాకాంక్షలు. జయహో భారత్.  

Monday 8 September 2014

ప్రజాకవికిదే నివాళి

                                                                         

ప్రజల హృదయాలకు బాసటగా నిలిచి అన్యాయంపై నిగ్గదీయటం తన జన్మహక్కని చాటిన గొప్ప మానవతావాది, ప్రజాస్వామ్య వాది ప్రజాకవి కాళోజి జయంతి నేడు. కన్నెర్ర చేసినా కన్నీళ్ళు పెట్టుకున్నా గుండె తడితో దుర్మార్గాలు, దమననీతిపై గుండెలవిసేలా పోరాడిన సిసలైన ప్రజాకవి కాళోజి శతజయంతి ఉత్సవాలకు ముగింపు సందర్భంగా ఆ మానవతావాదిని స్మరించుకునే సందర్భమిది. వ్యక్తి స్వాతంత్ర్యం కోసం ఉక్కుపిడికిలి భిగించి "నవయుగంబున నాజీవృత్తుల నగ్నసత్యమింకెన్నాళ్ళు.,   పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ బొందేదేన్నాళ్ళు.,      దమననీతితో దౌర్జన్యాలకు   దాగిలిమూతలు ఇంకెన్నాళ్ళు"  ....  అంటూ నిజాం పాలనలో పోలీసుల దౌర్జన్యంపై ప్రజాసమూహాలకు బాసటగా నిలిచి కలాన్ని ఆయుధంగా చేసి పోరాడిన ఉక్కుమనిషి మన కాళోజీ నారాయణరావు

అన్యాయాలకు వ్యతిరేకంగా గుండె చూపి పోరాడిన దీశాలి...
సిరాచుక్కలతో లక్షల మెదళ్లను కదిలించిన పోరాటశీలి....
జనం భాషతో జనపదాల్ని కదిలించిన కార్యశీలి...
స్వేచ్చాప్రియత్వం కోసం నిర్భీతితో పోరాడిన ప్రజాస్వామ్యవాదికిదే నా నివాళి!  

Thursday 4 September 2014

ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దిక్చూచి

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంద్రను స్వర్ణాంద్రగా  మార్చే విషయంలోఈ రోజు ప్రకటించిన అంశాలు  కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అన్ని జిల్లాలకు సమదూరంలో విజయవాడ పరిసరాల్లో రాజధానిగా ప్రకటిస్తూ  అదే సమయంలో అన్ని జిల్లాల ప్రగతికి తాను చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాల గురించి  అసెంబ్లీలో ప్రకటించిన విధానం ఎంతో సమగ్రంగా ఉంది., రాయలసీమ లో రాజధాని పెట్టాలని, వైజాగ్ లో రాజధాని ప్రకటించాలని., కాదు, కాదు...  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రాజధాని ఉండాలని ఎవరికి వారు వాదించి సమయం వృధా చేసుకోకుండా కొత్త రాజధాని ప్రగతి కోసం ఏమేం చేయాలో వీలయితే తగిన సూచనలు ఇవ్వడం మంచిది. ఇప్పటికే జాతీయ విద్యాసంస్థలు ఎక్కడెక్కడ వస్తాయో ప్రభుత్వం ప్రకటించింది.  మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలను నిర్మించాలని నిర్ణయించారు.  వీటికి అదనంగా.. ఏయే జిల్లాల్లో ఏమేం పెట్టదలచుకున్నామో జిల్లాల వారీగా విపులంగా నోట్ విడుదల చేశారు.  
                                                                 
                                                                             
       


నూతన పారిశ్రామిక నగరాల ఏర్పాటు.,కొత్త పోర్టుల ఏర్పాటు, పారిశ్రామికవాడలు, కొత్త విమానాశ్రయాలు, ఫుడ్ పార్క్ లు, ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ పార్క్ లు., గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, పారిశ్రామిక నగరాలు, గిరిజన విశ్వవిద్యాలయం, సంగీతం, లలితకళల అకాడెమి ల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్, ఇన్కుబేషన్ హబ్, ఫుడ్ పార్క్, రైల్వే జోన్ లు., పెట్రోలియం యూనివర్సిటి, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్, నౌకా నిర్మాణ కేంద్రం, ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజీ, సిరామిక్ పరిశ్రమ, ఆయిల్ పామ్ పరిశ్రమ, జలమార్గాల అభివృద్ధి,  పోలవరం ప్రాజెక్ట్, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ లు, ఆయిల్ రిఫైనరీ, క్రాకర్ యూనిట్, మిస్సైల్ పార్క్, ఆటోమొబైల్ హబ్స్, ఎయిమ్స్. సౌర,విండ్  విధ్యుత్ కేంద్రాలు, టూరిజం సర్క్యూట్, థీం పార్క్ లు, ఎరువుల కర్మాగారాలు, హార్టీ కల్చర్ జోన్స్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విత్తనోత్పత్తి కేంద్రాలు, రైల్వే వ్యాగన్ వర్క్ షాప్స్, మైనింగ్ స్కూల్స్  వగైరాలతో కొత్త రాష్ట్ర అభివృద్ధికి పూనుకోవడం నిజంగా అభినందనీయం. ఇవన్నీ సాకారం కావాలని , ఆందుకు పాలకులు చిత్తశుద్ధి తో ప్రయత్నించాలని కోరుకుందాం. 

Thursday 28 August 2014

Monday 25 August 2014

ఈటీవికి "సనాతన హిందూ ధర్మ పురస్కారం"

సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా, దేశ, విదేశాల్లోని అపురూప, పురాతన  దేవాలయాల గురించి కోట్లాది వీక్షకులకు అవగాహన కల్పిస్తున్న ఈటీవి "తీర్ధయాత్ర" కార్యక్రమాన్ని గుర్తించి తగురీతిలో గౌరవించింది అమెరికాకు చెందిన "గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ.  దేవాలయాల పరిరక్షణ గురించి ఈ నెల 22 నుంచి హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ లఘు చిత్ర ప్రదర్శన సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి చేతుల మీదుగా నేను "సనాతన హిందూ ధర్మ రక్షక్ పురస్కారం" ను అందుకున్నాను. ఈ పురస్కారాన్ని అందించి గౌరవించిన ఫౌండేషన్ చైర్మన్ వెలగపూడి ప్రకాశరావు గారు, "గజల్ మ్యాస్ట్రో" ఆత్మీయ మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఈనాడు హైదరాబాద్ మినీ ఎడిషన్ లో వచ్చిన కవరేజీ క్లిప్పింగ్ ఇది.
                                                                             

                                                                     

Saturday 9 August 2014

నాలుగు దశాభ్దాల "ఈనాడు"

                                                                                 
రేపు ఆగస్టు 10 కి సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఈ రోజునే తెలుగు పత్రికా ప్రపంచాన "ఈనాడు" అక్షర దీపార్చన ఆరంభించింది. కేవలం 4500 కాపీలతో మొదలెట్టి అగ్రశ్రేణి  తెలుగు దినపత్రిక గా అప్రతీహతంగా ముందుకు సాగుతోంది. పత్రికా రంగంలో ప్రయోగాలకు పుట్టినిల్లుగా నిలిచి., ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టిన పత్రికగా "ఈనాడు" తెలుగు వారి గుండెలలో కొలువుదీరింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వార్తా ప్రమాణాలకు సరికొత్త భాష్యం చెప్పింది. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా ఏనాడూ వెన్ను చూపకుండా సవాళ్ళను స్వీకరించి దృడంగా నిలిచింది.
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొచ్చిన ప్రతిసారీ బాధ్యతను గుర్తెరిగి నిరంకుసాధికారానికి ఎదురొడ్డి పోరాడింది. విశ్వసనీయత, నైతిక విలువలే గీటురాళ్ళుగా పవిత్ర విలువల పరిరక్షణ కోసం సొంత వ్యక్తిత్వాన్ని "ఈనాడు" ఏనాడూ వదిలి పెట్టలేదు. ప్రజల పక్షాన ఉద్యమ శంఖాలను పూరించడంలో., విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతను స్వీకరించడంలోనూ "ఈనాడు" ది ఎప్పుడూ ముందుండే తత్వమే.

కోట్లాది ప్రజల ఆశీస్సులతో తెలుగువారి ఇంటింటి నేస్తం గా "ఈనాడు" ఇప్పటికీ మరెప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. ఈనాడు తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈనాడు  మిత్రులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. "నాలుగు దశాభ్దాల ఈనాడు" పై ఈ రోజు రాత్రి  9 గంటలకు., తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ఈటీవి ఆంధ్రప్రదేశ్, ఈటీవి తెలంగాణ చానళ్లు  ప్రత్యేక చర్చను ప్రసారం చేస్తున్నాయి.  లోక్ సత్తా జాతీయ అధ్యక్షులు డా. జయప్రకాశ్ నారాయణ, ప్రముఖ తెలుగు దిన పత్రికలకు సంపాదకులుగా పని చేసిన సీనియర్ పాత్రికేయులైన ఇనగంటి వెంకట్రావు, కె. రామచంద్రమూర్తి , పొలిటికల్ ఎనలిస్ట్ సి. నరసింహారావు లు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న పాత్రికేయ మిత్రులు తప్పక చూడాల్సిన చర్చ ఇది.
                                                                     

Wednesday 6 August 2014

నా పాట "సాయినాధ" కు దృశ్య రూపం

గతంలో నేను రచించి విడుదల చేసిన "సాయి స్వరార్చన"  ఆడియో సీడీ లో "సాయినాధా.." అనే పాటకు ఇది దృశ్య రూపం. వీడియో రూపంలో ఈ పాటను మీ కోసం ఇక్కడ యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను. ఈ పాట చిత్రీకరణకు సహకరించిన గాయని గాయత్రి గారికి నా కృతఙ్ఞతలు.  
                                                               
                                                                   
                                     https://www.youtube.com/watch?v=bqFjwOzzOis

                                                                       

Tuesday 29 July 2014

యాపిల్స్ కొనేటప్పుడు జాగ్రత్త!

                                                                               

                                                                               
                                                                               
ఈ రెండు ఫోటోలను జాగ్రత్తగా గమనించండి. మొదటి ఫోటో లోని యాపిల్స్ నిగ నిగ మెరిసిపోతున్నాయి కదూ! ఇక రెండో, మూడో ఫోటోలను చూడండి... ఎలాంటి  ఆకర్షణ లేకుండా ఉన్న ఈ యాపిల్స్ కంటే మొదటి ఫోటోలోని యాపిల్స్ కొనడానికే వినియోగదారులు ఇష్టపడుతుంటారు. నిజానికి మన సిమ్లా లో విరివిగా పండే యాపిల్స్ రెండు, మూడు ఫోటోలలోనివే. మొదటి రకం యాపిల్స్ విదేశీ యాపిల్స్. విదేశీ యాపిల్స్ ఇంతలా మెరిసిపోవడం వెనుక వాటికి వ్యాక్స్ కోటింగ్ వేస్తారని మీకు తెలుసా?

గిరాకీకి తగ్గ సరఫరా మన దేశంలో లేకపోవడం వల్ల మనం యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ లోని కొంత భాగంలో పండే దేశీయ యాపిల్స్ ఏటా ఆగస్ట్ నెల నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, చిలీ, ఇరాక్ (వయా ఆఫ్ఘనిస్తాన్) చైనా ల నుంచి మన దేశంలోకి యాపిల్స్ యథేచ్చగా వచ్చిపడుతున్నాయి. యాపిల్స్ నిల్వ కాలాన్ని దాదాపు  10 నెలల వరకు పెంచాలంటే ప్రాసెస్ చేసిన పండ్లకు విదేశాల్లో ఎగుమతిదారులు ఎంచుకునే మార్గం వ్యాక్స్ కోటింగ్. ఇలా చేయటం వల్ల అవి తినేవారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ పండ్ల తోలు తీసి తిన్నప్పటికీ సమస్యలు వెంటాడే ప్రమాదముంది.

అందువల్ల యాపిల్స్ కొనుగోలు చేసేవారు పండు ఆకర్షణ చూసి మోసపోకుండా మార్కెట్లో వ్యాక్స్ కోటింగ్ లేని యాపిల్స్ చూసి కొనటం ఆరోగ్యానికి  ఎంతో మంచిది. అలానే దేశీయ పండ్లను చెట్టు నుంచి కోశాక వాటి సహజత్వం దెబ్బతినకుండా బాక్స్ లలో రవాణా చేస్తుంటారు. నిజానికి రెండో ఫోటోలో ఉన్న యాపిల్స్ ఇలానే ఉంటాయి. కోసిన వాటిని ప్రాసెస్ చేసి వ్యాక్స్ కోటింగ్ వేయకుండా కొంచెం ఆకర్షణీయంగా ఉండేవి మూడో ఫోటోలోనివి. వీటిని తిన్నా నష్టం లేదు. అలా చేస్తే వాటిని నిల్వ చేసే కాలం కొద్దిగా తగ్గుతుంది అంతే. మొత్తం మీద ఏ పండ్లు కొన్నా వాటిని మంచి నీటితో శుబ్రంగా కడిగి తినటం మంచిది.  

సుమారు రూ. 4,500 కోట్ల  విలువైన దేశీయ యాపిల్స్ తో పాటు ఏటా భారతీయ వినియోగదారులు దాదాపు రూ.,2000 కోట్ల విలువైన యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగించే యాపిల్స్  లో 60 శాతం వరకు దక్షిణ భారత దేశంలోనే అమ్ముడుపోతుండటం విశేషం. యాపిల్స్ కొనే దక్షిణ భారత పౌరులూ పారాహుషార్!             (సిమ్లా మిత్రుడు పురుషోత్తమరావు వెలది సహకారంతో)

Monday 7 July 2014

మోడీ వ్యవసాయాన్ని గట్టేక్కిస్తారా?

యూపీయే పాలనా కాలంలో అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అస్తవ్యస్త నిర్ణయాలతో దేశంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది.  రైతుల ఆత్మహత్యలు విపరీత స్థాయికి చేరాయి. ఈ తరుణంలో ఢిల్లీ పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడి ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టనున్న సాధారణ బడ్జెట్ లో రైతులకు వ్యవసాయంపై భరోసా పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. సమస్య మూలాలకు చికిత్స ఎంత ముఖ్యమో, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమూ అంటే ప్రధానం. ఈ పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్నిఇక్కడ లింక్ చేస్తున్నాను.

                                                                         

Sunday 1 June 2014

జయహో తెలంగాణ


పోరాటాలు ఫలించాయి...
ఆకాంక్షలు నెరవేరాయి...
తెలంగాణ కల సాకారమైంది
29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన
ఈ శుభదినోత్సవ వేళ....
యావత్ తెలంగాణ ప్రజలకు....
తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన....
కె. చంద్రశేఖరరావు  గారికి
హృదయపూర్వక శుభాకాంక్షలు.




Friday 16 May 2014

ఇది అవినీతిపై ప్రజల విజయం

బాబు-మోడీ జోడీది చారిత్రాత్మక విజయం. అవినీతిపరుల్ని కుంభకోణాలకు పాల్పడిన వారిని పార్టీలకు అతీతంగా ఓడించిన తీరు చూస్తుంటే.,  ప్రజలెంత కసిగా కాంగ్రెస్ ను, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ను మట్టికరిపించారో చూస్తేనే తెలుస్తోంది. అలానే పోటెత్తిన ఉద్యమం నుంచి ప్రభవించిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పార్టీకి ఘనవిజయం అందించడం చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతగా స్వపరిపాలన కోరుకున్నారో అర్ధమవుతోంది.ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను ఇరు రాష్ట్రాల ప్రజలు రెండు కళ్ళు పొడిచేసారు.  కన్నూమిన్నూ కానక సమాజాన్ని లెక్కపెట్టక ఇష్టానుసారం వ్యవస్థలను దోపిడీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. జగన్ తో కలిపి నీ కిది నా కిది లో పాలుపంచుకున్న వారంతా దాదాపుగా ఓటమి పాలవటం చూస్తే, వేల కోట్లు దోచుకున్న వారిపై ఇది ప్రజల విజయంగా చెప్పాలి. ఈ తీర్పు దోపిడీ రాజకీయాలకు, అవినీతిపరులకు చెంప పెట్టు మాత్రమె కాదు చావుదెబ్బ కూడా.  
                                                                             

Wednesday 30 April 2014

వ్యవసాయం పండగైంది ఎవరికి?!

వ్యవసాయాన్ని పండగ చేస్తామన్న పాలకులు తమ దుర్నీతితో రైతు బతుకుల్ని ఛిద్రం చేశారు. గడచిన పదేళ్ళలో సేద్యంలో ఉత్పత్తి  పెరుగుదల నమోదైనా ఆ మేరకు రైతుల నికరాదాయం ఏ మాత్రం పెరగకపోవటమే ఇందుకు నిదర్శనం. దేశంలో 45 శాతం రైతులు అప్పుల్లో ఉంటె, ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 82 శాతంగా ఉందని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే ప్రణాళికా సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.  దీన్ని బట్టి వ్యవసాయం పండగ  అంటే అది ఎవరికి పండగ అయ్యిందనే విమర్శలే నిజం. వ్యవసాయం లో ఉత్పత్తి ఖర్చులు వందల శాతం పెరిగినా ఆ మేరకు రైతుకు గిట్టుబాటు ధర దక్కటంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల బతుకుల్లో మార్పు రావటం లేదు. వ్యాసంలో పేర్కొన్నట్టు., రైతుకు ఎప్పుడు ఏం కావాలో అది అందించకుండా సేద్యానికి తోడ్పాటు ఇస్తున్నట్టు నటిస్తే వ్యవసాయం నుంచి వలసలు పెరుగుతాయని హెచ్చరిస్తున్న నా వ్యాసం ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                       
    

Monday 31 March 2014

జయాలనిచ్చే జయ ఉగాది

వరుస ఎన్నికలతో ఈ  వసంతాన్ని ఆస్వాదించే అవకాశాలు బహు తక్కువ. నిజానికి ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు తొడిగే ఈ వసంతమంటే ఎవరికైనా ఇష్టమే మరి. మన జీవితాల్లో కూడా ఈ జయ నామ సంవత్సర ఉగాది కొత్త ఆశలు చిగురింప చేయాలని మనసారా కోరుకుంటూ  మిత్రులందరికీ  శ్రీ జయ ఉగాది శుభాకాంక్షలు.
                                                                          

Thursday 30 January 2014

గ్రామాభివృద్ధి కోసం.... ఓ మంచి వెబ్ సైట్!

ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టి పెరిగిన ఊరిని, కన్నవారిని మర్చిపోకూడదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తహ తహ లాడుతున్న ఎందరో ఎన్నారైలు ఇప్పటికే తమవంతుగా తమ తమ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో సాయపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి ఆలోచనతోనే ముందు తరాలకు మన గ్రామం చరిత్ర,, సంస్కృతి, గ్రామం లోని విశేషాలు, ప్రసిద్ధ వ్యక్తుల గురించిన సమాచారంతో పాటు ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడో ఉన్న మన వూరి వారందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చి ప్రస్తుతం గ్రామాభివృద్ధికి ఏమేం చేయవచ్చో నిర్ణయించే ఒక సదవకాశం  swagraam.com ద్వారా కలగనుంది.
ప్రకాశం జిల్లాకు అద్దంకికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోదరులు బాచిన రాహుల్, అనిల్ లు దేశంలో తొలిసారిగా గ్రామాల అనుసంధానానికి, గ్రామాభ్యుదయానికి  swagraam.com కు రూపకల్పన చేయటం ద్వారా శ్రీకారం చుట్టారు. తెలుగు వారైన ఈ సోదరుల కృషి వల్ల మన స్వగ్రామానికి ఒక పేజి రూపొందించి దేశ విదేశాల్లో గ్రామానికి చెందిన వారిని ఆహ్వానించి గ్రామం అభివృద్ధికి పాటు పడవచ్చు. గ్రామం లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన చిత్రాలకు తోడు మన కుటుంబ సభ్యుల ఫొటోలనూ పేజీలో పెట్టుకోవచ్చు. కొన్ని ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వెబ్ సైట్ల తో పోల్చితే ఎంతో ఉపకరించే ఇటువంటి సైట్ రూపొందించిన ఈ సోదరులు అభినందనీయులు.
మరో విశేషం ఏమంటే ఎన్నో e-books రైట్స్ తీసుకుని మన విద్యార్ధుల కోసం ఉచితంగా అందిచేందుకు ఈ సైట్ ద్వారా వీరు కృషి చేస్తున్నారు. ఈ సోదరుల కృషిపై ఈ నెల 15వ తేదీన ఈటీవీ-2 లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే "యువ" లో ఒక ప్రత్యేక కధనాన్ని ప్రసారం చేశాం.  మీ కోసం ఆ వీడియో క్లిప్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                           

Tuesday 21 January 2014

తెలుగు సినిమా లెజెండ్ ఏఎన్నార్

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీయార్, ఏఎన్నార్ లు రెండు కళ్ళు.  అన్నగారు వెళ్ళిపోయిన 19 ఏళ్ళకు అదే జనవరి మూడో వారంలో తానూ స్వర్గానికి తరలిపోవటం చిత్ర పరిశ్రమకు తీవ్ర లోటు. ఆ మేటి నటుని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. యునిసెఫ్ అవార్డుల సందర్భంగా  వారి నుంచి నేను అవార్డ్ తీసుకుంటున్న ఓ జ్ఞాపకం నాకు మిగిలింది.
                                                                         

Sunday 12 January 2014

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.

ప్రకృతి తో మనిషి సహజీవనం చేసే అసలైన పండగ సంక్రాంతి. భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....  ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి. కష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో  ప్రసరించాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.